పవన్ తాజా ప్రశ్న.. తెలుగు నిధుల్ని ఇంగ్లిషుకా?

Update: 2019-11-20 10:48 GMT
సర్కారీ స్కూళ్లలో ఆంగ్ల బోధనపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి.. పవన్ వాదనలకు పొంతన లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే.. సర్కారీ స్కూళ్లలో తెలుగు బోధనను పూర్తిగా ఎత్తివేయాలని జగన్ ప్రభుత్వం అనుకోవటం లేదు.

ఏపీలోని సర్కారీ స్కూళ్లలో తెలుగు బోధనను ఒక సబ్జెక్టును ఉంచుతున్న విషయాన్ని వదిలేసి.. ఇంగ్లిషు పేరుతో పవన్ అండ్ కో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా పార్లమెంటులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ తెలుగు భాష మీద ఉన్న ప్రేమను చెప్పిన తీరుపై విమర్శలు సంధించారు జనసేన అధినేత. 

ఏపీ విభజన చట్టం ప్రకారం తెలుగుఅకాడమీ నిధులు ఏపీ.. తెలంగాణ రాష్ట్రాలు 52.. 48 నిష్పత్తిలో పంచుకోవాలన్న విషయాన్ని ప్రస్తావించటంపై పవన్ తప్పు పట్టారు. ఒక చేత్తో తెలుగుకు వెచ్చించాల్సిన నిధుల్ని మరో చేత్తో ఏపీ ప్రభుత్వం ఇంగ్లిష్ ను ప్రమోట్ చేసేందుకు ఉపయోగించనుందా? అని పవన్ ప్రశ్నించారు.

తెలుగు నిధులు గురించి మాట్లాడుతూ.. వాటిని ఇంగ్లిషు కోసం ఖర్చు చేస్తారా? అని అడిగిన పవన్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాట్లాడిన వీడియో క్లిప్ ను జత చేశారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేందుకు తెలుగు ఉపయోగపడుతుందన్న విషయం సదరు ఎంపీ ప్రసంగాన్ని చూస్తే అర్థమవుతుందన్నారు. తనకే కాదు.. ఎవరికైనా ఇదే భావన కలగటం ఖాయమన్నారు.

ఈ సందర్భంగా రాజ్యాంగంలోని 350ఏను ప్రస్తావించిన పవన్ కల్యాణ్.. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని పీఎంవో నిశితంగా పరిశీలిస్తోందన్నారు. ఏదైనా రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రజల మాతృభాషలో ప్రాధమిక స్థాయిలో విద్యా బోధన చేయాలంటూ రాష్ట్రపతి నేరుగా ఆదేశించొచ్చన్న వైనాన్ని గుర్తు చేశారు. పవన్ ట్వీట్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ రీతిలో రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News