ప‌వ‌న్ ఎఫెక్ట్‌?: బాబు యాంగ్రీబ‌ర్డ్ అయ్యాడుగా!

Update: 2018-03-18 05:40 GMT
మ‌న ప‌ని మ‌నం చేసుకుంటూ పోవ‌టంలో ఉన్న సుఖం.. పైనుంచి ఒక‌రు నిత్యం మానిట‌ర్ చేస్తుంటే ఒళ్లు మండ‌క మాన‌దు. దేశంలోనే రాజ‌కీయ అనుభ‌వం ఉన్న కొమ్ములు తిరిగిన నేత‌ల్లో తాను ముందు ఉంటాన‌ని చెప్పుకునే చంద్ర‌బాబుకు.. మీ పాల‌న‌లో ఈ త‌ప్పులేంటి?  ఈ స‌మ‌స్య‌పై ఇప్ప‌టివ‌ర‌కూ మీరు చేసిందేమిటి?  మీరు అంత పోటుగాళ్లే అయితే.. ఇదిలా ఎందుకు ఉంది? అంటూ నాన్ స్టాప్ గా లోపాల్ని ఎత్తి చూపిస్తే ఒళ్లు మండ‌దా?

స‌రిగ్గా బాబు ప‌రిస్థితి ఇప్పుడిలానే మారింది. అమ‌రావ‌తికి కూత‌వేటు దూరంలో ఉండే గుంటూరు ప‌ట్ట‌ణంలో అతిసార వ్యాధి ప్ర‌బ‌లి 16 మంది ఇప్ప‌టివ‌ర‌కూ మ‌ర‌ణించ‌టం.. పెద్ద ఎత్తున అనారోగ్యానికి గురై ఆసుప‌త్రుల్లో చికిత్స పొంద‌టం తెలిసిందే. ఈ ఇష్యూ మీద జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ రియాక్ట్ అయి.. ఆసుప‌త్రికి వెళ్లి బాధితుల్ని ప‌రామ‌ర్శించ‌టం.. ఏపీ ప్ర‌భుత్వానికి 48 గంట‌ల అల్టిమేటం జారీ చేశారు.

ఏపీ రాజ‌ధానికి స‌మీపంలో ఉన్న ప‌ట్ట‌ణంలో ఇంత దారుణం జ‌రుగుతుంటే ప్ర‌భుత్వం ఏం చేస్తుందంటూ ప‌వ‌న్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. 48 గంట‌ల్లో ఈ ఇష్యూను క్లోజ్ చేయ‌కుంటే గుంటూరు బంద్‌ న‌కు పిలుపునిస్తాన‌ని. ప్ర‌క‌టించారు. ఓవైపు జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు పెరుగుతున్న ప్ర‌జాద‌ర‌ణ‌తో కిందామీదా ప‌డుతున్న బాబుకు.. మిత్రుడిగా ఉన్న ప‌వ‌న్ ఒక్క‌సారిగా ప్లేట్ మార్చ‌టం.. వ‌రుస పెట్టి విమ‌ర్శ‌నాస్త్రాల్ని గురి పెట్ట‌టంతో కిందా మీదా ప‌డుతున్న ప‌రిస్థితి.

దీంతో పాల‌న మీద మ‌రింత దృష్టి పెట్టారు చంద్ర‌బాబు. ఏ నిమిషాన ఏం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి ఒక‌వైపు.. ఏ స‌మ‌స్య‌పై ప్ర‌భుత్వ యంత్రాంగం స‌రిగా దృష్టి పెట్ట‌కుంటే.. ఆ విష‌యాన్ని ప‌వ‌న్ ప్ర‌స్తావించి హైలెట్ చేస్తారోన‌న్న ఆందోళ‌న పెరుగుతోంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో శ‌నివారం చోటు చేసుకున్న కొన్ని ఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని రియ‌ల్ టైమ్ లో ప‌ర్య‌వేక్షించిన చంద్ర‌బాబు.. అధికారుల తీరుపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

విశాఖ జిల్లా న‌క్క‌ప‌ల్లిలోని మురుగు గుంట‌లో ప‌డి న‌లుగురు మ‌ర‌ణించ‌టం ప‌ట్ల తీవ్ర విచారాన్ని వ్య‌క్తం చేసిన చంద్ర‌బాబు.. బాధితుల్ని ఆదుకోవాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇక‌.. కృష్ణా జిల్లా గుడివాడ‌లో వృద్ధ దంప‌తుల‌ను కొంద‌రు దుండ‌గులు హ‌త్య చేసి కారుతో ఉడాయించిన వైనంపై సీఎం సీరియ‌స్ అయ్యారు. ఇలాంటి నేరాల్ని అదుపు చేయ‌టం.. నేర‌స్తుల్ని ప‌ట్టుకోవ‌టంలో జ‌రుగుతున్న జాప్యాన్ని క్వ‌శ్చ‌న్ చేశారు.

దొంగ‌ల్ని ప‌ట్టుకోవాలంటూ ఫైర్ అయ్యారు. పోలీసుల గ‌స్తీని మ‌రింత ముమ్మ‌రం చేయాల‌న్నారు. ఏపీలో కురిసిన అకాల వ‌ర్షాల కార‌ణంగా రైతులు న‌ష్ట‌పోకుండా చూడాల‌ని ఆదేశించారు.కృష్ణా జిల్లాలో మినుములు.. గుంటూరు జిల్లాలో మిర్చి రైతులు న‌ష్ట‌పోకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. మిర్చి పంట త‌డిస్తే రైతుల‌కు న‌స్టం వ‌స్తుంద‌ని.. రైతులు న‌ష్ట‌పోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. వ‌రుస‌గా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు.. వాటిపై అధికారులు స్పందిస్తున్న తీరుపై చంద్ర‌బాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంద‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News