పవన్ ఫీవర్ స్టార్ట్...?

Update: 2022-04-08 12:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అది సినిమాల్లో ఆయనకు ఫ్యాన్స్ ఇచ్చిన బిరుదు. అదే జనసేనానిగా ఆయన వేదిక ఎక్కితే తనకు పవర్ లేదు కాబట్టి ఆ బిరుదుతో పిలవవద్దు అని పవన్ సున్నితంగా అభిమానులను వేడుకుంటారు. నిజానికి ఏపీ రాజకీయాల్లో ఈ రోజుకు చూస్తే పవన్ ఆయన జనసేన పాత్ర ఏంటి అంటే అనుకూలురు ఒక విధంగా ప్రతికూలురు మరో విధంగా చెబుతారు.

ఇక పవనే స్వయంగా రెండు సీట్లలో ఓడిపోయారు కదా. ఆయన పార్టీకి వచ్చినవి అయిదారు శాతం ఓట్లే కదా. పైగా ఆయన సీజనల్ పోలిటీషియన్ అంటూ ప్రత్యర్ధి పార్టీల వారు  వెటకారం ఆడతారు. నిజానికి అలాంటి పవన్ని ఎవరూ పట్టించుకోనవసరం లేదు కదా. ఇదే లాజిక్ కదా.

కానీ పవన్ నామస్మరణ అధికార పార్టీయే ఎక్కువగా చేస్తోంది. ఆయన హ్యాబీగా పాలిటిక్స్ చేస్తారు అంటూనే మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు ఎక్కుపెడతారు. పవన్ కి ఏమీ తెలియదు అంటూనే ఆయన మీద బాణాలు వేస్తారు. ఆయన నెలకోసారి ఇలా వస్తారని చుట్టపు చూపుగా ఏపీకి రావడం ఆయనకు అలావాటు అని వైసీపీ నేతలు అంటారు.

కానీ వారే పవన్ విషయంలో గట్టిగా నోరు చేసుకుంటారు. పవన్ కి రాజకీయాలు తెలియవని, టీయార్పీ రేటింగ్ కోసమే మీడియా ఆయన్ని ఫోకస్ చేస్తోంది పేర్ని నాని అంటున్నారు. మరి ఆయన మీద ఎందుకు విమర్శలు చేస్తున్నారు నాని గారూ అని జనసైనికులు అడిగితే మాత్రం జవాబు లేదేమో

ఇక  వైసీపీ నేతల సంగతి అలా ఉంటే ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ సైతం పవన్ని ఈ మధ్య ఎక్కువగా తలచుకుంటున్నారు. ఆయన ఈ మధ్య జిల్లా టూర్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ పేరుని నేరుగా పలకకపోయినా బాబుకు  దత్తపుత్రుడు అని అంటున్నారు. మరి ఆ విధంగా పవన్ మీద జగన్ కూడా హాట్ కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు అన్నది కూడా చర్చగా ఉంది.

అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టం. ఏపీలో జనసేనకు సొంతంగా పోటీ చేస్తే గెలిచేటంత బలం ఉందో లేదో తెలియదు కానీ టీడీపీ జనసేన మాత్రం హిట్ కాంబినేషన్ అని రాజకీయాల్లో ఉన్న వారికి తెలుసు. టీడీపీకి కోస్తా జిల్లాలు కంచుకోట. గోదావరి జిల్లాల్లో జనసేన బలం పుంజుకుంది. మొత్తంగా చూస్తే అన్నీ కలిపి 101 సీట్లు ఉన్నాయి.

ఈ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుంటే మాత్రం 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయన్న భయం అయితే వైసీపీ నేతలలో ఉందని అంటున్నారు. అందుకే పవన్ మీద చంద్రబాబు మీద ఉమ్మడిగా, విడివిడిగా విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు. సరే ఎవరెన్ని విమర్శలు చేసినా పొత్తులో ఉండే వారు ఉంటారు. స్నేహాలు చేసే వారు చేస్తారు.

ఇదంతా రాజకీయం. రాజ్యాంగం లో అలా పొత్తులు పెట్టుకునే స్వేచ్చ అయితే ఉంది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. కానీ ఈ పొత్తుల ఎత్తుల మీద విమర్శలు చేయడం ద్వారా వైసీపీ నేతలౌ పవర్ ఫీవర్ అయితే గట్టిగా పట్టుకుందా అన్న డౌట్లు కచ్చితంగా వస్తున్నాయి. మరి ఇపుడే ఇలా ఉంటే రేపు నిజంగా పొత్తులు పెట్టుకుని వారు బరిలో దూకితే అపుడు ఆ వేడి ఎలా ఉంటుందో చూడాల్సిందే.
Tags:    

Similar News