అదృష్టం కొద్దీ సీఎం అయ్యావ్ జగన్: పవన్ హాట్ కామెంట్స్

Update: 2021-01-22 09:00 GMT
ప్రజల్లో బలం లేకున్నా.. రెండు చోట్ల పోటీ చేసి గెలవకున్నా కూడా జనసేనాని పవన్ కళ్యాన్ లో ఆ ధీమా ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావడం లేదని రాజకీయాల్లో పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఓడినా కూడా ఎక్కడా తగ్గకుండా పవన్ ముందుకెళుతున్న తీరును మాత్రం అభినందించాల్సిందేనంటున్నారు. తాజాగా మరోసారి వైసీపీ గెలుపుపై పవన్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొనడానికి తిరుపతికి వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ విలేకరులతో మాట్లాడారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో నాలుగు అంశాలపై చర్చించామని తెలిపారు. దేవాలయాలపై దాడులు, శాంతిభద్రతలు, రైతాంగ అంశాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలపై మాట్లాడామని తెలిపారు.

అదృష్టం కలిసి వచ్చి వైసీపీకి అందలం దక్కిందని.. వైఎస్ జగన్ సీఎం అయ్యాడని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.రోడ్లు బాగాలేవని పోస్టులు పెట్టినా అరెస్టులు చేస్తున్నారని.. గిద్దలూరులో ఎమ్మెల్యేను జనసైనికుడు నిలదీస్తే ఆత్మహత్య చేసుకునే వరకు వైసీపీ నేతలు భయపెట్టారని విమర్శించారు.

ఎస్సీ ఎస్టీ కేసులు ఏపీలో రాజకీయంగా వాడుకుంటున్నారని.. దళితులపైనే ప్రయోగిస్తున్నారని.. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా వైసీపీ నేతలు  వ్యవహరిస్తున్నారని పవన్ మండిపడ్డారు. వీరితీరుతో ప్రజల్లో సహనం నశిస్తోందని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాము రోడ్డెక్కి నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు.

ఏపీలోని దేవాలయాలపై 142 దాడులు జరిగితే స్పందించట్లేదని పవన్ విమర్శించారు. చర్చి , మసీదుల మీద దాడులు జరిగితే అందరూ గొంతెత్తుతారని.. ఆలయాలపై మాత్రం ఎందుకు స్పందించట్లేదని పవన్ నిలదీశారు. నిందితులను అరెస్ట్ చేయడం లేదని ధ్వజమెత్తారు.

కేంద్రంలోని బీజేపీ నేతలతో మంచి అవగాహన ఉందని.. రాష్ట్ర బీజేపీ నేతలతో అలాంటి అవగాహన కుదరట్లేదని పవన్ అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల అభ్యర్థిని పోటీచేయించాలనే డిమాండ్ వ్యక్తమవుతోందని పవన్ అన్నారు. మరో వారం రోజుల్లో ఎవరు పోటీచేసేది తెలుస్తుందన్నారు.ఏపీలో  ప్రత్యామ్మాయ పార్టీగా బీజేపీ-జనసేన కూటమి ఎదిగిందని.. తామే ప్రత్యామ్మాయం అని అన్నారు. జీహెచ్ఎంసీలాగే తిరుపతిని తీసుకుంటామన్నారు.

అన్ని మతాలను గౌరవిస్తామని.. మా ఇంట్లో బైబిల్, ఖురాన్ ఉంటుందని పవన్ అన్నారు. రామతీర్థం వెళితే సమస్యలొస్తాయనే వెళ్లలేదన్నారు. బైబిల్ అయినా.. భగవద్గీత అయినా ఒక్కటేనన్నారు.
Tags:    

Similar News