పవన్ కల్యాణ్.. ఇంటర్ 'పాఠాలు' చెబుతూనే ఉన్నారు!

Update: 2019-12-04 01:30 GMT
తను చదివిన ఇంటర్మీడియట్, అది కూడా ఫెయిల్ కావడం గురించి పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ ఎన్నో సార్లు చెప్పి ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి తన ఇంటర్ అనుభవాలను పవన్ చెబుతూనే ఉన్నారు. అదో ఆవు వ్యాసంలా సాగుతూ ఉంది. ఏ విషయాన్ని ఎత్తుకున్నా పవన్ కల్యాణ్.. ఇంటర్మీడియట్ వద్దకే వచ్చి ఆగుతూ ఉంటారు!

ఇప్పటి వరకూ తను ఎందుకు ఇంటర్మీడియట్ తో చదువు ఆపేయాల్సి వచ్చిందో పవన్ రకరకాలుగా చెప్పారు. ఇంటర్లో చదివిన గ్రూపుల గురించి కూడా రకరకాల మాటలు చెప్పారాయన. ఒకసారేమో ఎంపీసీ అని, మరోసారి ఎంఈసీ అని చెప్పారు. మరోసారి ఇంకో సబ్జెక్టుకు  ట్యూషన్ కు వెళ్లినట్టుగా చెప్పారు. ఈ మధ్యనే డాక్టర్ కావాలని అనుకున్నట్టుగా కూడా చెప్పారు. ఎంపీసీ చదవి డాక్టర్ ఎలా అవుతారనేది సందేహం!

ఆ సంగతలా ఉంటే.. తను ఇంటర్మీడియట్ ఫెయిల్ కావడానికి మరో రీజన్ కూడా చెప్పారు పవన్. అదేమిటంటే.. ఇంగ్లిష్ మీడియం అట! తను మొదటి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదివినట్టుగా, ఇంటర్ కు ఒక్కసారిగా ఇంగ్లిష్ మీడియంలో చదివే సరికి తను నెగ్గుకు రాలేకపోయినట్టుగా పవన్ చెప్పుకొచ్చారు. అలా చదువు మీద విరక్తి పుట్టిందని, అందుకే తను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినట్టుగా ఆయన చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ను పవన్ వ్యతిరేకిస్తున్న  సంగతి తెలిసిందే. అందుకోసమే పవన్ ఇలా తన ఇంటర్మీడియట్ ఫెయిల్యూర్ స్టోరీని మరోసారి, మరో రకంగా చెప్పారు.

అయినా పవన్ ఒక లాజిక్ మరిచినట్టుగా ఉన్నాడు. ప్రాథమిక - ఉన్నత పాఠశాలల్లో తెలుగు మీడియం చదవడం వల్ల చాలా మంది ఇంటర్లో ఇంగ్లిష్ మీడియంలోకి వచ్చి బోల్తా పడి ఉంటారు. అలా ఆలోచిస్తే.. స్కూల్ లెవల్లోనే ఇంగ్లిష్ మీడియం చదవడమే మంచిది అవుతుంది. ఈ లాజిక్ ను పవన్ అర్థం చేసుకోలేకపోతున్నట్టా?
Tags:    

Similar News