ప‌వ‌నూ...పార్ట్ టైం పాలిటిక్స్ వీడ‌రా?

Update: 2017-08-01 11:22 GMT
టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఎప్ప‌టి నుంచో ఓ అప‌ప్ర‌ద ఉంది. నాడు త‌న సోద‌రుడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్ట్ టైం పొలిటీషియ‌న్‌గానే కొన‌సాగారు. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్న ప‌వ‌న్‌... 2009 ఎన్నిక‌ల్లో అవ‌కాశం వ‌చ్చినా ఏ ఒక్క చోట కూడా పోటీ చేయ‌లేదు. ఆ త‌ర్వాత చిరు త‌న పార్టీని కాంగ్రెస్‌ లో విలీనం చేయ‌గా, చిరు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించిన ప‌వ‌న్‌... ఏకంగా త‌న సోద‌రుడి కుటుంబానికి దూరంగా జ‌రిగారు. అయితే త‌న సొంత పార్టీ పెట్టుకుంటున్న విష‌యం తెలిసి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇక‌పై ఫుల్ టైం రాజ‌కీయ వేత్త‌గా మారిపోతార‌ని తెలుగు ప్ర‌జ‌లు భావించారు. అయితే వారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన ప‌వ‌న్‌... మొన్న‌టి సార్వ‌త్రిక ఎన్నికల నాటికి పార్టీ అందుబాటులో ఉన్నా కూడా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి మాత్రం స‌సేమిరా అన్నారు.

టీడీపీ, బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తుగా నిలిచిన ప‌వ‌న్‌... ఏపీలో టీడీపీ అధికారం చేజిక్కించుకునే విష‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌న్న వాద‌న లేక‌పోలేదు. అయితే ఆది నుంచి పార్ట్ టైం పొలిటీషియ‌న్‌ గానే ఉంటూ వ‌స్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఇక‌నైనా ఫుల్ లైం రాజ‌కీయ‌వేత్త‌గా మార‌క‌పోతారా? అంటూ ఆయ‌న అభిమానులు ఎదురు చూస్తున్నారు. మొన్న‌టి విశాఖ ప‌ర్య‌ట‌న‌, నిన్న‌టి చంద్ర‌బాబుతో భేటీ త‌ర్వాత ఆ దిశ‌గా ప‌వ‌న్ నుంచి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న వ‌స్తుందంటూ వారితో పాటు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లంతా ఆశ‌గా ఎదురు చూశారు. అయితే ఈ ద‌ఫా కూడా ప‌వ‌న్ త‌న అభిమానులతో పాటు త‌న రాజ‌కీయ ప్ర‌స్థానంపై ఎన్నో ఆశ‌ల‌తో ఉన్న తెలుగు ప్ర‌జ‌ల‌పై నీళ్లు చ‌ల్లార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. నిన్న వెల‌గ‌పూడి స‌చివాలయంలో సీఎం చంద్ర‌బాబుతో జ‌రిగిన భేటీ అనంత‌రం అక్క‌డే మీడియా ముందుకు వ‌చ్చిన ప‌వ‌న్‌... త‌న భ‌విష్య‌త్తు రాజ‌కీయాల‌పై కాస్తంత విపులంగానే మాట్లాడారు. ద‌స‌రా నుంచి తాను రాజ‌కీయాల్లో మ‌రింత క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే అది కేవ‌లం వారానికి మూడు రోజులు మాత్ర‌మేన‌ని ఆయ‌న నోట నుంచి ప్ర‌క‌ట‌న రావ‌డంతో ప‌వ‌న్ అభిమానులు ఊసురుమ‌న్నారు.

మ‌రో ఏడాదిన్న‌ర‌లో ఎన్నిక‌లు పెట్టుకుని, ఆ ఎన్నిక‌ల్లో పోటీ జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించి మ‌రీ... వారానికి మూడు రోజులు మాత్ర‌మే రాజ‌కీయాలు చేస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డం నిజంగానే ఆశ్చ‌ర్య‌ప‌రిచే అంశమేన‌న్న వాద‌న వినిపిస్తోంది. వారంలో మూడు రోజులు రాజ‌కీయాల‌కు స‌మ‌యం కేటాయించే ప‌వ‌న్‌.... మిగిలిన నాలుగు రోజుల పాటు త‌న సినిమా కెరీర్‌పైనే దృష్టి సారిస్తాన‌ని విస్ప‌ష్టంగానే ప్ర‌క‌టించారు. అంటే పార్ట్ టైం పొలిటీషియ‌న్ అంటూ త‌న‌పై ఉన్న అప‌ప్ర‌ద‌ను తొల‌గించుకుని ఫుల్ టైం పొలిటీషియ‌న్‌ గా మారేందుకు ప‌వ‌న్ ఇంకా సిద్ధంగా లేర‌నే చెప్పాలి. మ‌రి ప‌వ‌న్ ఎప్పుడు ఫుల్ టైం పొలిటీషియ‌న్‌గా మార‌తారో ఆ దేవుడికే ఎరుక‌న్న‌మాట‌.
Tags:    

Similar News