అయ్యో.. మీరంత శ్ర‌మ ప‌డితే ఎలా ప‌వ‌న్ జీ!

Update: 2018-08-23 10:21 GMT
సీన్ కు ముందు ప్రిప‌రేష‌న్.. సీన్ చేసేట‌ప్పుడు ఏ మాత్రం మూడో బాగోలేకున్నా.. రీటేక్.. ఒక‌టికి రెండుమార్లు టేకులు.. కొన్నిసార్లు ఆరేడు టేకుల‌కు కూడా ఓకే కానీ సీన్ల‌ను అతి క‌ష్ట‌మ్మీదా ఒక పూటకు ఓకే చేయ‌టం.. ఆ వెంట‌నే షూట్ ను ప్యాక‌ప్ చేయ‌టం లాంటివి సినిమాల్లో మామూలే.

కానీ.. రాజ‌కీయాల్లో అలాంటివి కుద‌ర‌వు. సీన్ కు ప్రిప‌రేష‌న్.. టేక్ లు ఏమీ ఉండ‌వు. డైరెక్ట్ గా యాక్ష‌నే. రోజుల త‌ర‌బ‌డి ప్ర‌జా జీవితంలో అలా మునిగిపోవాల్సిందే. కానీ.. సినిమా రంగం నుంచి వ‌చ్చిన ప‌వ‌న్ కు అదే ప‌నిగా ఏక‌బిగువునా ప‌ర్య‌ట‌న‌లు.. రోడ్ షోలు నిర్వ‌హించ‌టం మ‌హా క‌ష్టంగా చెబుతారు. త‌న చుట్టూ ఉన్న వారి పండ‌గ‌ల‌కు సెల‌వులు ఇవ్వ‌టం.. తానూ సెల‌వులు తీసుకోవ‌టం చేస్తుంటారు.

షెడ్యూల్ ప్ర‌క‌టించి.. ఏదో కార‌ణం చేత వాయిదాల మీద వాయిదాలు వేయ‌టం అల‌వాటే. అలాంటి ప‌వ‌న్ అంద‌రూ షాక్ తినేట‌ట్లుగా ఒక భారీ షెడ్యూల్ ను ప్ర‌క‌టించారు. సెప్టెంబ‌రు 12 నుంచి ప్రారంభ‌మ‌య్యే తాజా షెడ్యూల్ ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కూ కొన‌సాగించ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ మాట‌ను విన్నంత‌నే ఎగిరి ప‌డి.. ఏంది?  నిజ‌మా? అన్న ఆశ్చ‌ర్యం అక్క‌ర్లేదు. ఎందుకంటే.. ఇది కేవ‌లం ప్ర‌క‌ట‌న మాత్ర‌మే.

గ‌తంలోనూ ఇదే రీతిలో షెడ్యూల్స్ ప్ర‌క‌టించ‌టం.. ఆ త‌ర్వాత పోస్ట్ పోన్ చేయ‌టం తెలిసిందే. అయితే.. ఈసారి అలా ఉండ‌ద‌ని.. అక్టోబ‌రు12తో మొద‌ల‌య్యే షెడ్యూల్ నాన్ స్టాప్ గా ఎన్నిక‌ల వ‌ర‌కూ సాగుతుంద‌న్న మాట ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.ఒక సీనియ‌ర్ రాజ‌కీయ నేత అయితే.. ఒక‌వేళ ప‌వ‌న్ చెప్పినట్లే కానీ చేస్తే.. ఆయ‌న రాజ‌కీయాల్లో కొంత‌కాలం సాగుతారని చెప్ప‌క త‌ప్ప‌ద‌న్నారు.

ఇలాంటి వారి అనుమానాల్ని ప‌టాపంచ‌లు చేయ‌టం కోస‌మైనా..  ప‌వ‌న్ ఈసారి తన షెడ్యూల్ ను నాన్ స్టాప్ గా కొన‌సాగించాలి. అయినా.. డ‌బ్బులిచ్చి సినిమాలు చూస్తాం ప‌వ‌న్ అన్నా.. కాసిన్ని సినిమాలు త్వ‌ర‌గా చేయ‌వే అన్నోళ్ల‌కే.. నువ్వు కోరుకుంటే నేను సినిమాలు చేయాలా?  సినిమాలు చేయ‌టం నా ఇష్టం.. చూస్తావా.. చూడ‌వా? అన్న‌ది నీ ఇష్టం అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించే ప‌వ‌న్‌.. ఇలాంటి రాజ‌కీయ నేత‌ల మాట‌ల‌కు ప్రాధాన్య‌త ఇచ్చి.. నాన్ స్టాప్ లాంగ్ షెడ్యూల్ మాట మీద నిల‌బ‌డ‌తారా ఏంది?
Tags:    

Similar News