ప‌వ‌న్ కు తెలంగాణ గుర్తుకు వ‌చ్చేసింది!

Update: 2018-08-19 08:32 GMT
ఒక రాజ‌కీయ పార్టీ పెట్టిన‌ప్పుడు ఒక విజ‌న్.. ఒక వ్యూహం త‌ప్ప‌నిస‌రి. కానీ.. అలాంటివేమీ లేకుండా.. ఎప్పుడేం అనిపిస్తే అది చేసుకుండా పోయే చిత్ర‌మైన మ‌న‌స్త‌త్వం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ లో క‌నిపిస్తుంటుంది. తాజాగా అలాంటి తీరునే మ‌ళ్లీ ప్ర‌ద‌ర్శిస్తున్నారు ప‌వ‌న్‌.

పార్టీ పెట్టిన మొద‌ట్లో తెలంగాణ‌లో కాస్త హడావుడి చేసిన ప‌వ‌న్.. త‌ర్వాతి కాలంలో ప‌ట్టించుకున్న‌ది లేదు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత తెలంగాణ అంశాల మీదా.. తెలంగాణ రాష్ట్రంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల మీదా.. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల మీద ఇప్ప‌టివ‌ర‌కూ ఫోక‌స్ చేసింది లేదు. కానీ.. ఇప్పుడు మాత్రం తెలంగాణ‌లో పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు యుద్ధ ప్రాతిప‌దిక‌న చేప‌ట్టాల‌ని ఆయ‌న ఆదేశాలుజారీ చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ‌లో రాహుల్ గాంధీ రెండు రోజుల యాత్ర.. డిసెంబ‌రులో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేసీఆర్ సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో.. ప‌వ‌న్ కూడా అలెర్ట్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. సెప్టెంబ‌రులో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో.. కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో అదిరిపోయే బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తామ‌ని.. దీనికి కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని తీసుకొస్తామ‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా జ‌న‌సేన సైతం తెలంగాణలో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. సెప్టెంబ‌రు రెండు.. మూడు వారాల్లో నిర్వ‌హించే ఈ స‌భ అదిరిపోవాల‌న్న ఆదేశం ప‌వ‌న్ నుంచి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ పెద్ద‌గా ప‌ట్ట‌ని తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన ప‌నులు వేగిరం పూర్తి చేయాల‌ని.. మొత్తంగా  15 ల‌క్ష‌ల వ‌ర‌కూ జ‌న‌సైనికుల్ని పార్టీలో ఎన్ రోల్ చేసే ల‌క్ష్యాన్ని నిర్దేశించిన‌ట్లుగా స‌మాచారం. ఎన్నిక‌ల నాటికి పోటాపోటీగా బ‌రిలోకి దిగేందుకు స‌న్నాహాలు చేయాల‌ని పార్టీ వ‌ర్గాల‌కు ప‌వ‌న్ చెప్ప‌టం వెనుక ఆస‌క్తిక‌ర‌మైన వాద‌న‌ను వినిపిస్తున్నారు.

ఇప్ప‌టికే టీఆర్ ఎస్ అనుకూల ప్ర‌క‌ట‌న‌లు చేసిన ప‌వ‌న్.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ కు లబ్థి చేకూరేలా బ‌రిలోకి దిగుతార‌న్న మాట ప‌లువురి నోట నుంచి వ‌స్తోంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చ‌టానికి ప‌వ‌న్ పార్టీ ప‌నికి వ‌స్తుంద‌ని అదే జ‌రిగితే.. కాంగ్రెస్ ను దెబ్బ తీసి.. టీఆర్ ఎస్ కు మేలు జ‌రిగేలా ప‌వ‌న్ ప్లాన్ సిద్ధం చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇంత‌కాలం తెలంగాణ స‌మ‌స్య‌ల మీద ప‌ట్ట‌ని ప‌వ‌న్‌.. ఇక‌పై తెలంగాణ ఇష్యూల మీద మాట్లాడ‌తార‌న్న మాట‌ను పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి.. ఈ విష‌యంలో ప‌వ‌న్ ఎంత‌వ‌ర‌కూ న్యాయం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News