సీఎం ప‌వ‌న్ అనే నినాదాల‌పై ప‌వ‌న్ ఇంత కూల్ రిప్లై

Update: 2017-12-06 14:54 GMT
జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విశాఖలో పర్యటన‌లో ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డీసీఐ ఉద్యోగులు చేస్తున్న దీక్షలో పవన్‌ పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. దీక్ష శిబిరం వద్ద ఉన్న ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేశ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి, వెంకటేశ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంత‌రం ప‌వ‌న్ మాట్లాడుతుండ‌గా...ఆయ‌న అభిమానులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తుంటే...చాలా కూల్‌ గా రిప్లై ఇచ్చారు.

విశాఖలో డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డీసీఐ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి మ‌ద్దతు తెలుపుతున్న‌ట్లు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ ప‌వ‌న్ వెల్ల‌డించారు. ఈ సందర్భంగా ఉద్యోగులనుద్దేశించి పవన్‌ మాట్లాడారు. మీ బాధలు పట్టించుకోవడానికి - నైతిక మద్దతు ఇవ్వడానికే ఇక్కడికి వచ్చానని  అన్నారు. డీసీఐ ప్రైవేటీకరణ ప్రతిపాదన చాలా బాధకలిగించిందన్నారు.  నష్టాల్లో ఉన్న వాటిని ప్రైవేటీక‌ర‌ చేయడంలో తప్పులేదని...కానీ లాభాల బాటలో డీసీఐను ప్రైవేటీకరణ చేయాలనుకోవడం దారుణమన్నారు. ఇంత‌ వరకూ ప్రధాని మోడీని ఏమీ అడగలేదని - డీసీఐ ప్రైవేటీకరణ ఆపాలని ప్రధాని మోడీకి లేఖ రాస్తానని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రధాని మోడీపై త‌నకు వ్యక్తిగతంగా చాలా గౌరవముందని ప‌వ‌న్ తెలిపారు.

తన విశ్వాసం ప్రజల కోసమే కాని.. పార్టీల కోసం కాదని, కాంగ్రెస్‌ నేతల్లా కాఫీ - టీలు తాగి కబుర్లు చెప్పి వెళ్లేవాడిని కానని ప‌వ‌న్ తెలిపారు. ఆశించిన ఫలితం రాకపోతే డీసీఐ ఉద్యోగులతో కలిసి పోరాటం చేస్తానన్నారు. వెంకటేశ్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను బాబు - మోడీ అమలు చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. విశాఖ డీసీఐ ఉద్యోగుల సమస్యను ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం - బీజేపీ నేతలు పట్టించుకోవాలన్నారు. ఎలాంటి సమస్యనైనా చర్చలతో పరిష్కరించుకోగలమన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం కోసమే పార్టీ పెట్టానని - పదవులపై తనకు ఆశ లేదన్నారు. తనకు ప్రాణాలు లేవు.. ధైర్యం ఉందన్నారు. జనం కోసం జైలుకెళ్తాను.. లాఠీ దెబ్బలు తింటానన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేని టీడీపీ - బీజేపీలకు వచ్చే ఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కు లేదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

కాగా, ప‌వ‌న్ ఈ ప్ర‌సంగం చేస్తున్న స‌మ‌యంలో ఆయ‌న అభిమానులు సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటూ నిన‌దించారు. దీంతో ప‌వ‌న్ స్పందిస్తూ..ఇలాంటి నినాదాలు చేయ‌కండి. సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే నిదాం మీకు ఉత్సాహంగా ఉంటుందేమో...కానీ నాకు కాదు. ప‌ద‌వుల బాధ్య‌త‌ను తెస్తాయి. అయితే నాకు ఎలాంటి ప‌ద‌వులు లేకున్నా...పెద్ద ఎత్తున బాధ్య‌త ఉంది. ఆ బాధ్య‌త నుంచి నేను పారిపోను` అని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు.

కాగా, ప్రభుత్వం దృష్టికి పవన్ కల్యాణ్ ఏ సమస్య తీసుకొచ్చినా పరిష్కరించేందుకు సిద్ధమని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న ..డీసీఐ ప్రైవేటీకరణ అంశాన్ని సీఎం దృష్టి తీసుకెళ్తామని, అలాంటి సంస్థలను కాపాడుకోవాల్సిన‌ అవసరం ఉందని ఆయన తెలిపారు.
Tags:    

Similar News