పవన్ నిర్ణయంతో కారు... హుషారు...

Update: 2018-12-04 05:41 GMT
పవన్ కల్యాణ్ సినీ హీరో తన నటనతో అటు ఆంధ్రప్రదేశ్‌లోను - ఇటు తెలంగాణలోను లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. తన అన్న మెగా స్టార్ చిరంజీవి లాగే రాజకీయ అరంగేట్రం కూడా చేశారు. గడచిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని అన్నారు. దీని ప్రభావం తెలుగుదేశం పార్టీకి ఎంతో కలసి వచ్చింది. అక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. నాలుగేళ్ల అనంతరం తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికలలో తన మద్దతు ఏ పార్టీకి ఉంటుందో ఇప్పటి వరకూ ప్రకటించలేదు. దీని పై విమర్శలు గుప్పుమన్నాయి.  ఇక రెండు రోజులలో తెలంగాణ ఎన్నికలు ఉన్నాయన గా పవన్ కల్యాణ‌్ తనదైన శైలిలో స్పందించారు. తమ పార్టీ తెలంగాణలో ఎవరికి మద్దతిస్తోందో ఈ నెల 5వ తేదీన‌ ప్రకటిస్తామంటూ ట్వీట్ చేసారు. దీనిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. పవన్ కల్యాణ్ గురించి తెలిసిన వారంతా ఆయన మద్దతు అధికార తెలంగాణ రాష్ట్ర సమితికే ఉంటుందని అంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు.

తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలన పై పవన్ కల్యాణ‌్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణలో చేపడుతున్న నీటిపారుదల ప్రాజెక్టులు, డబ‌ల్ బెడ్రూమ్‌ ఇళ్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని అనేక సార్లు చెప్పారు. అంతే కాకుండా గడచిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన తనయుడు, మంత్రి తారక రామారావును పవన్ కల్యాణ‌్ వ్యక్తిగతంగా కలుసుకుని అభినందించారు. మరోవైపు పవన్ కల్యాణ‌్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో నిర్వహించిన జనసేన కవాతును మంత్రి కేటీఆర్ ను ప్రశంసించారు. ఆ సమయంలో కేటీఆర్ "శభాష్ పవన్ మీ కవాతుకు మా అభినందనలు* అని ట్విట్ కూడా చేసారు.

చంద్ర‌బాబు యాంగిల్‌లో చూసినా ఇక పవన్ కల్యాణ్ చంద్రబాబు నాయుడిని, కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ మద్దతు తెలంగాణ రాష్ట్ర సమితికే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు రెండు రోజులు ముందు పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు ప్రకటిస్తే కారు జోరు మరింత ఊపందుకుంటుందని అంటున్నారు. పవన్ కల్యాణ్‌కు ఆంధ్రలో కంటే తెలంగాణలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ, అదే జరిగితే తెలంగాణలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయంగానే కనిపిస్తోంది..
Tags:    

Similar News