హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్

Update: 2020-03-06 10:15 GMT
మళ్లీ ఒకసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పయనమయ్యారు. గతంలో ఒకసారి హఠాత్తుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ నాయకులను కలిశారు. ఆ తర్వాత వెంటనే బీజేపీతో తాము పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఏం ఆశించో ఆ సమయంలో పొత్తు పెట్టుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. తాజాగా శుక్రవారం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పవన్ బయల్దేరారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ మేల్కొని ఇప్పుడు ఢిల్లీ పర్యటన చేయడంతో ఆసక్తికరంగా మారింది.

అయితే ఆంధ్రప్రదేశ్ లో త్వరలో నిర్వహించనున్న స్థానిక ఎన్నికల కోసం ఈ పర్యటన అని జనసేన నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతో దీనిపై చర్చిచేందుకు పవన్ ఢిల్లీ వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశమై చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాతో పవన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల అంశంతో పాటు అధికార వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల ఏర్పాటు తదితర అంశాలపై బీజేపీ పెద్దలతో చర్చించనున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికలపైనే ఈ పర్యటన ఉండనుంది.

బీజేపీతో జనసేన పొత్తు, స్థానిక ఎన్నికల్లో ఎవరెవరికి ఎక్కడ సీట్లు కేటాయించాలి.. రెండు పార్టీల మధ్య సమన్వయంపై చర్చించే అవకాశం ఉంది. గతంలోనే రాజధాని తరలింపుపై ఆందోళన చేయాలనుకుని చివరి నిమిషం లో వెనక్కి తగ్గారు. ఆలోపు పవన్ కల్యాణ్ సినిమాల్లోకి వెళ్లారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో బీజేపీతో చర్చించేందుకు పవన్ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పెద్దలతో చర్చించి తర్వాత రాష్ట్రస్థాయి నేతలతో కలిసి ఎన్నికల్లో పొత్తులపై ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News