పవన్ రావడం ఆలస్యమే కానీ, రావడం పక్కా

Update: 2016-01-11 06:40 GMT
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ వస్తారా.. రారా? బీజేపీ-టీడీపీ తరుఫున ఆయన ప్రచారం చేస్తారా చేయరా? అసలు నిన్నమొన్నటి వరకు ఇలాంటి ప్రశ్నలు వినిపించాయి. వాటన్నిటికీ ఇప్పుడు పుల్ స్టాప్ పడింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ గ్రేటర్ ప్రచారానికి వచ్చేందుకే నిర్ణయించుకున్నారని సమాచారం. ఆ మేరకు టిడిపి-బిజెపి నాయకత్వాలకు ఆయన సమాచారం పంపినట్లు తెలుస్తోంది. తాజాగా తనపై టీఆర్ ఎస్ ఎంపి - కేసీఆర్ కూతురు కవిత చేసిన వ్యాఖ్య లను సీరియస్‌ గా తీసుకున్న పవన్.. ఎన్నికల ప్రచారానికి రావాలని డిసైడైనట్లు తెలుస్తోంది.
   
కొంచెం తిక్కున్న పవన్‌ కు కేసీఆర్ ఎప్పుడో చుక్కలు చూపించారని పవన్‌ పై కవిత విమర్శనాస్త్రాలు సంధించారు. సెటిలర్ల ఓట్ల కోసం టిడిపి-బిజెపి నేతలు పవన్ కల్యాణ్‌ ను ప్రచారానికి తీసుకురావాలనుకుంటున్నాయని, అయితే ఎన్నికల ముందు మేకప్‌ తో వచ్చే పవన్ కల్యాణ్ - ఎన్నికల తర్వాత ప్యాకప్ చెబుతారని కవిత ఘాటైన విమర్శలు చేశారు. దీనితో ఇప్పటివరకూ ప్రచారంపై ఊగిసలాడుతోన్న పవన్ గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి రావాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. ఆమె విమర్శలకు ప్రచార సభల్లోనే సమాధానం చెబుతారంటున్నారు. ఆ మేరకు సమాచారం అందుకున్న మిత్రపక్షాలు, ఆయన క్యాంపెయిన్ షెడ్యూల్‌ ను రూపొందించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈనెల 28,29,30న చంద్రబాబునాయుడు నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నందున ఆయనతో కలసి ప్రచారం చేయాలా? లేక విడిగా ప్రచారం నిర్వహించాలా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదని చెబుతున్నారు.

అయితే, బాబు తర్వాతనే పవన్ ప్రచారం ఉండవచ్చని సూచనప్రాయంగా చెబుతు న్నారు. కేవలం కవిత విమర్శలకు జవాబు చెప్పేందుకే పవన్ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని టిడిపి వర్గాలు అంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో టీఆర్ ఎస్‌ పై విమర్శలతోపాటు, గతంలో కేసీఆర్ సీమాంధ్రులపై చేసిన విమర్శలను కూడా ప్రస్తావిస్తారని అంటున్నారు. కాగా, ముందు ఎన్నికల ప్రచారంపై పవన్ కొంత సందిగ్థంలో పడినట్లు మిత్రపక్షాలు చెబుతున్నాయి. ఒకవేళ తాను ఎన్నికల ప్రచారానికి రాకపోతే, మిగిలిన వారి మాదిరిగానే తాను కూడా కేసీఆర్‌ కు భయపడి ప్రచారానికి రాలేదన్న విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందని.. ఆస్తులు కాపాడుకునేందుకే తాను ప్రచారానికి రావడం లేదన్న విమర్శలు వస్తే, అది తన ఇమేజ్‌ కు భంగమన్న ముందుచూపుతోనే పవన్ ప్రచారానికి రావాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. మొత్తానికి పవన్ వస్తే ఇబ్బందని భావించి ఆయనపై విమర్శలకు దిగిన టీఆరెస్ కు ఇప్పుడు ఆ విమర్శలకు సమాధానం చెప్పేందుకే ఆయన ప్రచారానికి వస్తుండడంతో గొంతులో వెలక్కాయ పడినట్లయింది.
Tags:    

Similar News