లాక్కోవద్దు..లాక్కోవద్దని నేను చెబుతున్నా..2

Update: 2015-08-23 11:19 GMT
కన్నీరుతో వచ్చే రాజధాని అక్కర్లేదని.. ఆనందంతో వచ్చే రాజధాని తనకు కావాలని చెప్పిన ఆయన.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎన్నికల సమయంలో మద్ధతు ఇచ్చిన సమయంలో ఆయన అనుభవం.. అపారమైన నమ్మకంతో ఇచ్చానని.. జగన్ తో తనకు ఎలాంటి వైరం లేదన్న పవన్.. వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని స్పష్టం చేశారు.

రాజధాని నిర్మాణం కోసం గతంలో తాను సందేహాలు వ్యక్తం చేసినప్పుడు (ఎన్నికలకు ముందు).. చంద్రబాబు భూసేకరణ.. సమీకరణ అవసరం లేకుండా.. ప్రభుత్వ భూములు.. అటవీ భూములు డీ నోటిఫై చేసి వినియోగిస్తామని చెప్పారని.. ఒక్క ఎకరం కూడా సేకరించాల్సిన అవసరం లేదన్నారని గుర్తు చేశారు. తర్వాతేం జరిగిందో తెలీదని.. తనకు మాత్రం భూమి అవసరం లేదనే చెప్పారంటూ కొత్త విషయాన్ని చెప్పుకొచ్చారు.

భూసేకరణకు తాను వ్యతిరేకమని.. ల్యాండ్ ఫూలింగ్ విషయంలో రైతులు లేవనెత్తుతున్న న్యాయమైన అంశాలపై ప్రభుత్వం ఆలోచించాలని.. రైతులకు అన్యాయం చేసే పని చంద్రబాబు చేస్తారని తాను అనుకోవటం లేదన్నారు.  బాబుది రెండు కళ్లసిద్ధాంతమని.. ఒక కన్నుకు నొప్పి కలిగించేలా ఆయన వ్యవహరించరని.. రెండు కళ్లను సమానంగా చూస్తారంటూ వ్యాఖ్యానించారు.

రాజధాని కోసం భూమిని.. లాక్కోవద్దంటూ మూడుసార్లు నొక్కి పలికిన పవన్.. ‘‘నేను చెబుతున్నాను’’ అంటూ చాలా బలంగా.. ఆవేశంగా.. ఉద్వేగంగా చెప్పారు. తన మాట ప్రభుత్వం వింటుందన్న ఆశ ఉందన్న పవన్.. ప్రభుత్వం తన మాట వినని పక్షంలో ధర్నా చేస్తానని ప్రకటించారు. జయప్రకాశ్ నారాయణ లాంటి మేధావులతో కూడిన కమిటీ వేసి.. రాజధాని కోసం భూములిచ్చిన వారి సమస్యలపై ఏపీ సర్కారు దృష్టి సారించాలని కోరారు. తనకు కులం అంటగట్టొదన్న ఆయన.. ఒక ప్రముఖ పత్రికలో రాసిన ఒక ఎడిటోరియల్ కాలమ్ ను ప్రస్తావించారు.

తాను గతంలో రాజధాని ప్రాంతంలో పర్యటించిన సమయంలో తన వెంట తన సామాజిక వర్గానికి చెందిన యువకులున్నారని రాశారని.. అది చాలా తప్పన్నారు. తాను కులం.. మతం లాంటి వాటికి అతీతంగా ఉంటానన్న పవన్.. తన కూతుళ్లలో ఒకరు హిందువు అయితే.. మరొకరు క్రిస్టియన్ అని.. తాను కులాలకు అతీతుడ్ని అని చెప్పుకున్నారు. అలాంటివి తనకు అంటగట్టొద్దని సున్నితంగా హెచ్చరించారు.

దివంగత నేత వైఎస్ హయాలో వాన్ పిక్ కోసం వేలాది ఎకరాలు సేకరించినప్పుడు.. కరణం బలరాం లాంటి నేతలు సైతం.. ఎన్నికల ప్రచార సమయంలో తనకు చెప్పి.. వాటిని ప్రస్తావించాలని.. ప్రజలు చాలా అగ్రహంగా ఉన్నారని చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన పవన్ కల్యాణ్.. వాన్ పిక్ విషయంలో వైఎస్ చేసింది తప్పు అయితే.. రాజధాని విషయంలో టీడీపీ సర్కారు చేస్తున్నది తప్పే కదా? అన్నది తెలుగుదేశం నేతలు ప్రశ్నించుకోవాలన్నారు.

మొత్తంగా చూస్తే.. రాజధాని కోసం రైతుల దగ్గర నుంచి భూముల్ని సేకరించొచ్చద్దని విస్పష్టంగా చెప్పేసిన పవన్.. రైతులు ఇష్టపడి ఇస్తే తీసుకోవాలన్నారు. అందుకు భిన్నంగా జరిగితే మాత్రం తాను పోరాడటానికి సిద్ధంగా ఉంటానని అభయమిచ్చారు. తన ప్రసంగంలో మంత్రులను.. కొందరు టీడీపీ నేతలపై విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్..  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును పొగడటం.. ఆయనపై తనకింకా నమ్మకం ఉందన్న మాటను పదే పదే చెప్పటం ద్వారా.. తాను గొడవకు దిగటం లేదని.. రైతుల విషయంలో చంద్రబాబు మరో కోణంలో కూడా ఆలోచించాలన్న సంకేతాన్ని ఇచ్చినట్లు కనిపించింది. మొత్తంగా.. రైతుల ప్రయోజనాలకు తాను పెద్దన్న మాదిరి వ్యవహరిస్తానని.. అందుకోసం ఎంతకైనా సిద్ధమన్న విషయాన్ని చెబుతూనే.. చిన్న విషయానికి తెగే దాకా లాక్కుంటావా చంద్రబాబు? అన్న మాటను పరోక్షంగా చెప్పేశారు. పవన్ చెప్పాల్సింది చెప్పేశారు. మిగిలింది చంద్రబాబు రియాక్షన్ మాత్రమే.
Tags:    

Similar News