త్వరలో విశాఖకు పవన్...జనసేన నేతల కోసం

Update: 2022-10-21 16:30 GMT
పవన్ కళ్యాణ్ అతి త్వరలోనే మరో టూర్ విశాఖలో పెట్టుకోనున్నారు. ఈసారి ఆయన విశాఖ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపిన జనసేన నాయకులను పరమర్శించనున్నారు. ఈ నెల 15న విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రుల మీద జరిగిన దాడి ఘటనకు సంబంధించి బాధ్యులు అంటూ పదుల సంఖ్యలో జనసేన నేతల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో హత్యాయత్నం కింద కేసులు పెట్టి మరీ అరెస్టుల పర్వం కొనసాగించారు.

దీంతో 61 మందికి స్టేషన్ బెయిల్ రాగా తొమ్మిది మందికి మాత్రం జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. అయితే ఈ విషయం మీద జనసేన హై కోర్టులో న్యాయ పోరాటం చేయడంతో తొమ్మిది మందిని బెయిల్ లభించింది. ఉమ్మడి విశాఖ జిల్లా కీలక నాయకులుగా ఉన్న వీరంతా ఇపుడు బెయిల్ మీద విడుదల అయ్యారు. అదే విధంగా విశఖ జిల్లా నాయకులుగా ఉన్న బొలిశెట్టి సత్య, శివశంకర్, డాక్టర్ రఘులను అరెస్ట్ చేయవద్దు అని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ మొత్తం పరిణామాల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. తాము ఎపుడూ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచుతామని, దానికి తగినట్లుగా తమకు న్యాయం దక్కింది అన్నారు. తమ పార్టీ నేతలకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టుకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

కాగా ఈ నెల 15 నుంచి 17 వరకూ మూడు రోజుల పాటు విశాఖలో ప్రభుత్వ ప్రేరేపిత అలజడిలో జనసేన నేతల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి వేధించారని ఆయన ఆరోపించారు. హత్యాయత్నం వంటి సెక్షన్ల మీద కేసులు పెట్టడం జరిగింది అని ఆయన అన్నారు. ఇది నిజంగా దారుణమని, అయితే న్యాయ వ్యవస్థ మాత్రం తమకు న్యాయన్ని అందించిందని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా అరెస్ట్ అయి జైలులో కొన్ని రోజుల పాటు ఉన్న జనసేన నేతలకు సంబంధించి వారితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఎంత మనో వేదనకు గురి అయి ఉంటారో తనకు తెలుసు అని తొందరలోనే వారిని, వారి కుటుంబాలను పరామర్శిస్తాను అని జనసేనాని తెలియచేశారు. అంటే త్వరలోనే జనసేనాని విశాఖకు రానున్నారు అన్న మాట.

ఇదిలా ఉండగా తన పార్టీ నేతల అరెస్ట్ తో తాను జనవాణి కార్యక్రమాన్ని విశాఖలో ఈ నెల 16న  వాయిదా వేసుకుంటున్నట్లుగా పవన్ ప్రకటించారు. ఇపుడు జనవాణి కార్యక్రమం కూడా విశాఖలో నిర్వహించడానికి డానికి తగిన తేదీని ఖరారు చేసుకుని మరీ విశాఖలో జనసేనాని అడుగుపెడతారు అని అంటున్నారు. మొత్తానికి మళ్లీ విశాఖ జనసేనాని వస్తున్నారు అని తెలియడంతో జనసేన వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అదే టైం లో ఈసారి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తం కావాలని అంతా కోరుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News