మార్చి 14న ప‌వ‌న్ ఆ క్లారిటీ ఇస్తాడ‌ట‌

Update: 2017-02-20 18:02 GMT
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన చేనేత సత్యాగ్రహ సభలో బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఉద్వేగ‌పూరితంగా ప్ర‌సంగించారు. పదవుల కోసం తాను రాజకీయాలలోకి రాలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సామాజిక న్యాయం కోసమే రాజకీయాలలోకి వచ్చానన్నారు. ప్రభుత్వాలు ఎవరికైతే అండగా నిలబడవో..వారి పక్షాన తాను న్యాయం కోసం పోరాడతానని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. ప్రజాసేవకు అధికారం అవసరం లేదని పేర్కొన్నారు. మార్చి 14న జన‌సేన విధానాలపై వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. త‌మ వెబ్‌సైట్ ద్వారా చేనేత, రాజధాని, గనులు వంటి సమస్యలపై జనసేన విధానం వెల్లడిస్తామన్నారు. వారసత్వ నాయకత్వంపై తనకు వ్యతిరేకత లేదని, పోరాటపటిమ, నిస్వార్థమైన నాయకుల కోసం ఎదురుచూస్తున్నట్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం మోసం చేస్తోందని ఈ సంద‌ర్భంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

సత్యాగ్రహం అంటే నిజం తాలూకు కోపం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సంద‌ర్భంగా అన్నారు. రైతులు, చేనేత కళాకారులు, జవాన్లు అంటే తనకు ఎంతో అభిమానమన్నారు. చేనేతను గౌరవించడమంటే దేశ సంస్కృతిని గౌరవించడమేనని పవన్ చెప్పారు. చేనేతకు బ్రాండ్  అంబాసిడర్ గా ఉండటమే తనకు కోట్ల ఆస్తి అని చెప్పారు. కమర్షియల్ బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటంలో ఆత్మ సంతృప్తి లేదన్నారు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానంటే హేళన చేశారని పవన్ కల్యాణ్ అన్నారు. తనను ఎంగిలాకులు ఎత్తుకునే వాడిగా అవహేళన చేశారని చెప్పిన పవన్ తనను వారితో పోల్చినందుకు గర్వంగా ఉందన్నారు. శుభ్రం చేసే వారు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందన్న సంగతిని ఒక్క సారి ఊహించుకోవాలని తన విమర్శకులను కోరుతున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.

వారంలో ఒక్కరోజైనా చేనేత దుస్తులు ధరించాలని పవన్‌ కల్యాణ్ కోరారు. చేనేతకు కార్పొరేషన్‌ ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఆలోచించాలన్నారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవాలని లక్షలాది మంది ప్రజల పొట్ట కొడుతున్న వ్యాపారులను కట్టడి చేయాలని  పవన్‌ కల్యాణ్ డిమాండ్ చేశారు. 11 రకాల ఉత్పత్తులు కేవలం చేతిమగ్గాల మీదే నేయాలని కానీ, పవర్‌లూమ్స్‌ వల్ల ఆ పని కూడా దొరకని పరిస్థితి ఉందన్నారు. క్రికెట్‌, టెన్నిక్‌ క్రీడాకారులకు ఇచ్చినట్లే.. చేనేత కళాకారులకు నగదు ప్రోత్సహకాలివ్వాలని పవన్‌కల్యాణ్‌ అన్నారు. ప్రభుత్వాల హామీల అమలుపై చేనేత సంఘాలు పర్యవేక్షణ కమిటీ వేసుకోవాలన్నారు. చేనేతలను గౌరవించడం అంటే దేశ సంస్కృతిని గౌరవించినట్లేనని పవన్ కల్యాణ్‌ అన్నారు. చేనేత కార్మికుడు అంటే ఒప్పుకోను, చేనేత కళాకారుడు అంటానన్నారు. వాళ్ల కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.  గుంటూరులోని మంగళగిరి వద్ద చేనేత కార్మికులు నిర్వహిస్తున్న సత్యాగ్రహ సభావేదిక చేరుకున్న సంద‌ర్భంగా చేనేత మగ్గాలను ప‌వ‌న్ పరిశీలించారు. అనంతరం తమ సమస్యల పరిష్కారం కోసం సత్యగ్రహ దీక్ష చేస్తున్న చేనేత కార్మికులకు నిమ్మరసం అందజేసి పవన్‌ దీక్షలను విరమింపజేశారు. అనంత‌రం ఆయ‌న ప్ర‌సంగించారు.
Tags:    

Similar News