రాఫెల్ డీల్‌ కు బైపాస్ స‌ర్జ‌రీ.. మోదీని విచారించండి

Update: 2019-03-07 05:48 GMT
కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మ‌రోమారు రాఫెల్‌ పై ఘాటుగా స్పందించారు. రాఫెల్ యుద్ద విమానాలు కొనుగోలుకు సంబంధించిన ర‌హ‌స్య ప‌త్రాలు చోరీకి గురైన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టుకు విన్న‌వించిన విష‌యం తెలిసిందే. ఆ అంశంపై ఇవాళ  న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాఫెల్ ఫైల్స్ మిస్సైన అంశంలో మీడియాను కూడా విచారించాల‌ని ప్ర‌భుత్వం అంటోంద‌ని - కానీ ఆ డీల్‌లో 30 వేల కోట్లు చోరీ చేసిన వ్య‌క్తిని కూడా విచారించాల‌ని రాహుల్ డిమాండ్ చేశారు. ఆ అవినీతికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయ‌న్నారు. ర‌హ‌స్య ప‌త్రాల్లో ఉన్న వ్య‌క్తుల‌ను కూడా విచారించాల‌న్నారు. మోదీని ర‌క్షించేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకున్నార‌ని రాహుల్ ఆరోపించారు.

రాఫెల్ ఒప్పందాన్ని రూటు మార్చేందుకు మోదీ బైపాస్ స‌ర్జ‌రీ చేశార‌ని ఆ ర‌హ‌స్య ప‌త్రాల్లో ఉంద‌ని - మ‌రి ఆ ప‌త్రాల ప్ర‌కారం మోదీని కూడా ద‌ర్యాప్తు చేయాల‌న్నారు. ప‌త్రాల‌ను మాయం చేయ‌డ‌మే మోదీ స‌ర్కారు ప‌ని అని రాహుల్ అన్నారు. రాఫెల్ డీల్‌లో మోదీ స‌మాంత‌రంగా చ‌ర్చ‌లు నిర్వ‌హించార‌ని గ‌ల్లంతు అయిన ప‌త్రాలు ఉన్న‌ట్లు చెప్పారు. అనిల్ అంబానీకి ల‌బ్ధి చేకూర్చాల‌న్న ఉద్దేశంతోనే.. రాఫెల్ విమానాల అప్ప‌గింత ఆల‌స్యంగా మారుతోంద‌ని రాహుల్ అన్నారు. మోదీ దారుణ‌మైన అవినీతికి పాల్ప‌డ్డార‌ని - స‌మాంత‌ర డీల్ జ‌రిపిన మోదీపై క్రిమిన‌ల్ విచార‌ణ ఎందుకు చేప‌ట్ట‌ర‌న్నారు. మోదీని వ్య‌తిరేకిస్తున్న వారిపైనే ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని రాహుల్ విమ‌ర్శించారు. ఒక‌వేళ ఈ డీల్‌ లో మోదీ త‌ప్పులేకుంటే - మ‌రెందుకు ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌ర‌కావ‌డం లేద‌న్నారు. సంయుక్త పార్ల‌మెంట‌రీ క‌మిటీని ఎందుకు ఏర్పాటు చేయ‌లేద‌న్నారు. మీడియా ధైర్యంగా ముందుకు వెళ్తుంది కాబ‌ట్టే, వారిని విచారించాల‌ని మోదీ స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తోంద‌ర్నారు. మోదీకి వ్య‌తిరేకంగా నిల‌బ‌డే స‌త్తా మీడియాకు ఉంద‌న్నారు.

వివాదాస్పద రాఫెల్ ఒప్పందంపై సమీక్షించరాదన్న వైఖరిని కేంద్రం మరోసారి పునరుద్ఘాటించింది. రక్షణ శాఖ నుంచి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పంద పత్రాలు చోరీ అయ్యాయని సుప్రీంకోర్టుకు తెలిపింది. చోరీ చేసిన వారిపై చట్టపరంగా చర్య తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నది. రాఫెల్ ఒప్పంద వార్తలను ప్రచురించినందుకు ది హిందూ వార్తా పత్రికపై అధికార రహస్యాల చట్టం కింద చర్య తీసుకుంటామని హెచ్చరించింది. రాఫెల్ పత్రాలను బహిరంగపరిచిన వారు అధికార రహస్యాల చట్టం, కోర్టు ధిక్కరణ కింద దోషులవుతారని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదించారు. పత్రాల చోరీకి పాల్పడిన వారిపై తీసుకున్న చర్యల విషయమై గురువారం ఒక నివేదికను సమర్పిస్తామన్నారు. రాఫెల్ ఒప్పందం విషయంలో కేంద్రానికి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ పై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. రాఫెల్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను కొట్టివేయాలని సుప్రీంకోర్టు డిసెంబర్ 14న నిర్ణయించినప్పుడు కేం ద్రం కొన్ని కీలక విషయాలను తొక్కిపెట్టిందని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా - అరుణ్‌ శౌరీ - న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సంయుక్తంగా పిటిషన్ వేశారు.
Tags:    

Similar News