పాక్ జట్టు రద్దు చేయాలని పిటీషన్

Update: 2019-06-19 07:16 GMT
శత్రుదేశమైన భారత్ చేతిలో అంత దారుణంగా పాకిస్తాన్ టీం ఓడిపోవడాన్ని ఆ దేశ అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోవడం లేదు. అందుకే కెప్టెన్ సర్ఫరాజ్ సహా పాక్ ఆటగాళ్లపై దుమ్మెత్తి పోస్తున్నారు. సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. మ్యాచ్ లో ఆవళింతలు తీసిన కెప్టెన్ సర్ఫరాజ్ పై అభిమానులు ఇప్పటికే ట్రోలింగ్ లు మొదలు పెట్టారు.

తాజాగా ఓ అభిమాని  ప్రస్తుత పాక్ జట్టును నిషేధించాలని పాకిస్తాన్ లోని గుజరాన్ వాలా సివిల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అంతేకాదు.. ఇంత చెత్త టీంను ఎంపిక చేసిన ఇంజుమామ్ ఉల్ హక్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీని రద్దు చేయాలని పిటీషన్ లో పేర్కొన్నాడు. ఈ మేరకు సామా న్యూస్ పేర్కొంది. అయితే పిటీషన్ ను విచారణకు స్వీకరించిన గుజరన్ వాలా సివిల్ కోర్టు న్యాయమూర్తి దీనిపై వివరణ ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు నోటీసులు జారీ చేశారు.

పాకిస్తాన్ దారుణ ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టీమ్ లో సమూల మార్పులు తేవాలని డిసైడ్ అయ్యింది. టీమ్ మేనేజ్ మెంట్ లోని కోచ్ లు, సెలెక్టర్లతో సహా కొంతమందిని మార్చాలని భావిస్తున్నట్టు సమాచారం. పాక్ కోచ్ మిక్కీ అర్థర్ ను సాగనంపాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది. టీమ్ మేనేజర్, బౌలింగ్ కోచ్ లపై వేటు వేయడంతో పాటు సెలక్షన్ కమిటీ మొత్తం రద్దు చేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. పాకిస్తాన్ జట్టు భారత్ చేతిలో పరాజయం పాలైన దరిమిలా పీసీబీ గవర్నింగ్ బోర్డు బుధవారం సమావేశం కానుంది. ఈ మేరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.


Tags:    

Similar News