ఆఫ్ లైన్ జీవోల ఎపిసోడ్ లో ఏపీ సర్కారుకు మొట్టికాయ తప్పదా?

Update: 2021-08-25 12:30 GMT
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని న్యాయస్థానాల్లో సవాలు చేయటం.. న్యాయపోరాటం చేయటం.. ఆ సందర్భంగా ప్రభుత్వాలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకావటం గురించి తెలిసిందే. ఇటీవల కాలంలో పలు అంశాల విషయంలో ఏపీ హైకోర్టు నుంచి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్న ఏపీ ప్రభుత్వానికి.. మరోసారి అలాంటి పరిస్థితి ఎదురు కానుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

గతానికి భిన్నంగా ఆన్ లైన్ లో ఉంచే జీవోలకు బదులుగా ఆఫ్ లైన్ లో ఉంచేలా ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తటం తెలిసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక జర్నలిస్టు ఈ జీవోను సవాలు చేస్తూ ఏపీ హైకోర్టు ఆశ్రయించారు. ప్రభుత్వం జారీ చేసే జీవోల్ని ఆన్ లైన్ లో ఉంచటం 1990 నుంచి వస్తుందని.. సమాచార హక్కు చట్టంలో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా జీవోల్ని పూర్తిస్థాయిలో అందరికి అందుబాటులో ఉంచుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని పారదర్శకంగా ఉండేలా చేయటం కోసం ఆన్ లైన్ లో ప్రభుత్వ నిర్ణయాల్ని ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అందుకు భిన్నంగా తాజాగా ప్రభుత్వం తాను జారీ చేసే జీవోల్ని వెబ్ సైట్ లో ఉంచకూడదని నిర్ణయించటం సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1) బికి భిన్నమన్న వాదనను తన పిటిషన్ లో విన్నవించారు. జీవోల్ని రహస్యంగా ఉంచితే.. పాలనా వ్యవహారాలన్నిప్రజలకు ఏమీ తెలీకుండా పోతుందని.. అందుకు జీవోల్ని ఆన్ లైన్ లో పెట్టకూడదన్న నిర్ణయం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ.. జీవోల్ని వెబ్ సైట్లో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.  ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఏపీ ప్రభుత్వం తాను జారీ చేసే జీవోల్ని ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లో ఉంచాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే.

ఆఫ్ లైన్ లో జీవోల్ని ఉంచటం సరికాదని పేర్కొన్న తెలంగాణ హైకోర్టు.. ఇరవై నాలుగు గంటల్లో జీవోలు వెబ్ సైట్ లో ఉంచాల్సిందేనని తేల్చింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై హైకోర్టును ఎవరైనా ఆశ్రయిస్తే.. ఇబ్బంది తప్పదన్న మాట వినిపించింది. అందుకు తగ్గట్లే.. తాజాగా ఒక జర్నలిస్టు.. ఏపీ హైకోర్టును ఆశ్రయించటంతో.. ఆఫ్ లైన్ లో జీవోల్ని ఉంచాలన్న దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News