ఈ బాదుడు ఇప్పట్లో ఆగదా మోడీ?

Update: 2017-01-16 06:33 GMT
యావద్దేశాన్ని తాను చేసిన ఒక్క ప్రకటనతో ప్రభావితం చేసిన ప్రధానిగా మోడీని దేశ ప్రజలు అస్సలు మర్చిపోరు. ఆయన్ను ఎలా మర్చిపోరో.. 2016 నవంబరు 8 రోజును కూడా ఎవరూ మర్చిపోలేరు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ.. తన ప్రసంగంలో భాగంగా నల్లధనాన్ని ఆర్థిక వ్యవస్థ నుంచి దూరం చేస్తే.. ధరలు తగ్గే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఆయన మాటల్ని చాలామంది ఏకీభవించారు కూడా. అయితే.. ఆ మాటల్లో నిజం సంగతి ఏమిటన్నది గడిచిన రెండు నెలల్లో కనిపిస్తూనే ఉంది. మిగిలిన నిత్యవసర ధరల మాట ఎలా ఉన్నా.. పెట్రోల్ డీజిల్ ధరలు అంతకంతకూ పెరిగిపోవటమే తప్పించి తగ్గని పరిస్థితి. పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచేటప్పుడు రూపాయిల్లో పెంచే చమురుసంస్థలు.. తగ్గించేటప్పుడు మాత్రం పైసల్లో తగ్గించటంపై జనం గగ్గోలు పెడుతున్నారు.

గడిచిన ఆరు వారాల్లో నాలుగుసార్లు పెట్రోల్ డీజిల్ ధరల్ని పెంచేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు కనిష్ఠానికి చేరుకున్నప్పుడు కూడా లీటరు పెట్రోల్ రూ.60 దిగువకు వచ్చింది లేదు. అదే సమయంలో ముడిచమురు ధరలు కాస్త మారినంతనే లీటరుపెట్రోలు రూ.75కు పెంచేస్తున్న వైనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నల్లధనం మాయమైనంతనే ధరలు తగ్గిపోతాయన్నప్రధాని మాటలతో పెట్రోల్.. డీజిల్ ధరలుభారీగా తగ్గుతాయన్న ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేశారు. అయితే.. ఆ అంచనాలు తప్పన్న విషయం తేలిపోయింది. నోట్ల రద్దు నిర్ణయాన్నిప్రధాని ప్రకటించిన సమయంలో లీటరు పెట్రోల్ ధర రూ.72.25 ఉండగా.. డీజిల్  లీటరు రూ.61.55 పైసలు ఉంది. అప్పటి నుంచి పలు దఫాలు ధరల్ని పెంచుతూ చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయంతో ధరలు భారీగా పెరగటమే కాదు.. తాజాగా సవరించిన ధరల నేపథ్యంలో లీటరు పెట్రోల్ రూ.75.91 కాగా.. డీజిల్ ధర లీటరు రూ.64.34గా నిర్ణయించారు. పెట్రోల్.. డీజిల్ ధరలు పెరిగితే.. దాని ప్రభావం ప్రత్యక్షంగానే కాదు.. పరోక్షంగా భారీగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోలేం. వివిధ రంగాల్నిప్రభావితం చేసేలా పెట్రోల్.. డీజిల్ ధరల్నిపెంచుతూ ప్రభుత్వం ఎందుకు నిర్ణయాలు తీసుకుంటుంది? మోడీ చెప్పిన అచ్చే దిన్ ఎప్పుడు వస్తుంది?  ప్రధాని తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని దేశ ప్రజలు స్వాగతిస్తున్నా.. ఆయన చెప్పినట్లుగా ప్రజల బతుకుల్లో అచ్చేదిన్ ఎందుకు రావాట్లేదు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News