పీకే ప్రొడక్షన్స్... సూపర్ హిట్టేనా... ?

Update: 2022-05-02 08:39 GMT
పీకే ఉరఫ్ ప్రశాంత్ కిశోర్ మొత్తానికి తన చిరకాల కోరికను తానే తీర్చుకోవాలనుకున్నారు. జేడీయూలో కొన్నాళ్ళు రాజకీయ నేతగా మసలిన ఈ బిహారీ బాబు  కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ ద్వారా ఆ ముచ్చట పూర్తి స్థాయిలో తీర్చుకోవాలని తలపోశారు. కానీ ఖద్దరు పార్టీలో కధ సరిగ్గా సాగలేదు. దాంతో కొంత నిరాశపడిన పీకే తానే ఎందుకు పార్టీ పెట్టకూడదు అని భావించారు.

చివరికి సాహసం చేయరా డింభకా అన్న తీరున ఆయన ఒక రాజకీయ పార్టీకి రెడీ అయిపోయారు. పీకే సొంత పార్టీ ప్రకటన ఇపుడు దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. విషయానికి వస్తే పీకేకు వంట ఎలా చేయాలో వచ్చు, ఆయన సలహా సూచనలు వంటి దినుసులు బాగానే వంటకు కుదిరిపోతాయి. కానీ వంట చేయడం వేరు, తానే హొటలు పెట్టి బిజినెస్ చేయడం వేరు.

ఈ రెండింటికీ మధ్య చాలా తేడా ఉంది. పీకే ఇంతకాలం తెర వెనక డైరెక్షన్ మాత్రమే చేశారు. అంటే హీరోలు వేరు, వారు అందగాళ్ళు, ధీరోధాత్తులు,  జన హృదయాలను గెలుచుకున్న వారు. అయితే వారు గెలుపు తీరానికి కడు సమీపంలో ఉన్న వేళ పీకే వ్యూహాలు వారిని ఒడ్డున పడేశాయి. అంటే ఇక్కడ ఒక్క  పీకే స్ట్రాటజీ మాత్రమే ఏ నాయకుడినీ గెలిపించలేదు

అతని బలం, బలగం, ఇమేజ్, రాజకీయ చాతుర్యం, జనాల్లో ఆయనకు ఉన్న ఫోకస్. ఆయన దూకుడు ఇలా ఎన్నో ప్లస్ పాయింట్స్ తో పాటుగా పీకే కూడా కలసి వచ్చారు అనుకోవాలి. కానీ పీకే ఒక్క వ్యూహమే గెలిపిస్తే ఆయన కొన్ని చోట్ల టేకప్ చేసిన రాజకీయ పార్టీలు ఎందుకు పరాజయం పాలు అవుతాయి. 2017లో యూపీలో పీకే కాంగ్రెస్ ఎస్పీ, బీఎస్పీలను టోటల్ గా  కలిపి చేసిన ప్రయోగం ఎందుకు ఫెయిల్ అయింది. అదే విధంగా పీకే ఖాతాలో మరిన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి కదా.

అంటే పీకే వ్యూహాలు అన్నవి గెలిచే పార్టీలకే పనిచేస్తాయి అన్నది కూడా మరో విశ్లేషణ. అలాగే మమతా బెనర్జీ అయినా ఏపీలో జగన్ అయినా తమిళనాడులో స్టాలిన్ అయినా గెలిచారు. మరి వారు తమ ఇమేజ్ తో కాక  ఒక్క పీకే వల్ల మాత్రమే తాము కుర్చీ ఎక్కామని చెప్పుకుంటారా. ఆయన జస్ట్ హెల్ప్ చేశారు అని మాత్రమే అనగలరు.

మరి పీకేకు ఇవన్నీ తెలియదా. ఆయన వ్యూహాలు పనిచేయాలంటే దానికి అతి పెద్ద పొలిటికల్ పాడింగ్ ఉండాలన్న లెక్కలు ఆయనకు అర్ధం కావా. అంటే ఇది రాజకీయం. అదో పెద్ద మోహం, పద్మ వ్యూహం. అందువల్ల ఇపుడు పీకే ఆ మోజులో ఉన్నారు. ఎందరికో అధికారాన్ని అందించిపెట్టిన తాను జస్ట్ వ్యూహకర్తగా ఉండడమేంటి అన్న బాధ ఆయనలో చాలా కాలంగా ఉంది.

అందుకే ఈ తెర వెనక డైరెక్టర్ కాస్తా ఇపుడు తెర ముందు హీరోగా వచ్చేస్తున్నాడు. మామూలుగా మనకు సినీ రంగంలో కూడా అద్భుతమైన డైరెక్టర్లుగా హిట్లు కొట్టిన వారు తామే ఎందుకు హీరో కాకూడదు అని ట్రై చేసి సినిమాలు తీసిన సందర్భాలు ఉన్నాయి. అయితే వారు హీరోలుగా మాత్రం అంతలా సక్సెస్ కాలేదు అన్నది చరిత్ర చెప్పిన నిజం.

ఇక రాజకీయ రంగం కూడా అలాంటిదే. జనాలతో ముడి వేసుకున్నదే. బలమైన ఎమోషన్స్ ఎన్నో వర్కౌట్ అయితేనే ఈ నాయకుడు అయినా నిలిచేదీ, గెలిచేది. మరి పీకే అంటే రాజకీయ పార్టీలకు, విశ్లేషకులకు మాత్రమే తెలిసిన పేరు. అలాంటి ఆయన సొంతంగా పార్టీ పెట్టి జనంలోనే  తేల్చుకుంటాను అంటున్నారు అంటే ముందుగా ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఆనక భారతదేశ రాజకీయాన్ని కూడా తిట్టుకోవాలి.

రాజకీయాల్లో ప్రజా సేవకు రోజులు గతించిపోయాయి. వ్యూహాలే గెలిపిస్తాయి. తిమ్మిని బమ్మిగా చేసినవారే కుర్చీలు ఎక్కుతారు అనుకుంటే కనుక అలాంటి  రిజల్టే వస్తుందని నమ్మితే కనుక పీకే గ్యారంటీగా సక్సెస్ అవుతారు. ఇక పీకే ఎందరికో వ్యూహాలు అందించిన వారు తన వ్యూహాలు తనకు ఉండవా. మరి ఆయన పనిచేసిన పార్టీలతో మిత్రుడిగానే ఇప్పటిదాకా ఉన్నారు. ఇపుడు ఆయన పార్టీ పెడితే వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏది ఏమైనా పీకే ప్రోడక్షన్స్ అన్నది భారత రాజకీయాల‌లో ఒక సంచలనం, అక్కడ నుంచి వచ్చే రాజకీయ చిత్ర రాజం హిట్టా ఫట్టా అన్నాది కాలం చెప్పే జవాబు.
Tags:    

Similar News