అత్యాచారాలపై ఎట్టకేలకు స్పందించిన మోదీ

Update: 2018-04-13 17:46 GMT
నిర్భయ ఘటన దేశాన్ని కుదిపేసిన తరువాత కూడా అలాంటి దారుణాలు ఆగలేదు. అయితే... తాజాగా యూపీలోని ఉన్నావ్ - కశ్మీర్‌ లోని కఠువాలో జరిగిన అత్యాచార ఘటనలు మరోసారి దేశాన్ని కుదిపేస్తున్నాయి. కఠువాలో అయితే ఎనిమిదేళ్ల చిన్నారిని దారుణంగా చిదిమేయడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. విపక్షాలు - ప్రముఖులే కాదు అన్ని వర్గాల నుంచి దీనిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే - ఆయన సోదరుడు తనపై అత్యాచారం చేశారంటూ ఉన్నావ్ బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటన తరువాత బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో మరణించడం మరింత వివాదమైంది. మరోవైపు కఠువా ఘటన మూడు నెలల కిందటే జరిగింది. గొర్రెలు మేపుకోవడానికి వెళ్లిన ఎనిమిదేళ్ల గుజ్జర్ చిన్నారిని ఒక మాజీ ప్రభుత్వాధికారి - ఆయన కుమారుడు - మేనల్లుడు - మరికొందరు పోలీసు అధికారులు కలిసి ఎత్తుకెళ్లి నిర్బంధించి కొన్నాళ్లపాటు దారుణంగా అత్యాచారాలు జరిపి అనంతరం గొంతు నులిమి చంపేశారన్నది ఆరోపణ. ఈ ఘటనలో అరెస్టయిన పోలీసుఅధికారుల విడుదల కోసం జమ్ముకశ్మీర్ మంత్రులు ఇద్దరి ఆధ్వర్యంలో ర్యాలీలు తీయడం మరింత వివాదాస్పదమైంది.
    
ఈ ఘటనలు ప్రజల్లో ప్రభుత్వాలపై వ్యతిరేకత తేవడంతో చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించకతప్పలేదు. ఈ రోజు ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. రెండు రోజులుగా దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఉన్నావ్, కఠువా లాంటి ఘటనలు నాగరిక సమాజంలో జరగకూడనివని అన్నారు. ఇటువంటి ఘటనలతో మనం సిగ్గుపడాల్సి వస్తుందని, మహిళలపై దారుణాలకు పాల్పడుతోన్న వారు చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు. మన ఆడబిడ్డలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.


Tags:    

Similar News