కోడెల చివరి ఫోన్ కాల్ లెక్క తేలిందా?

Update: 2019-09-19 06:01 GMT
ఒక సీనియర్ రాజకీయ నేత.. కరుడుకట్టిన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కోడెల శివప్రసాద్ లాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమైనా.. పోస్ట్ మార్టం రిపోర్ట్ తో పాటు.. పోలీసుల ప్రాథమిక విచారణ కూడా ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఉందన్న విషయాన్ని స్పష్టం చేశాయి.

కోడెల మరణంపై వివిధ వాదనలు వినిపించాయి. సూసైడ్ చేసుకున్న తర్వాత ఆయన్ను దగ్గర్లోని ఆసుపత్రికి కాకుండా బసవతారకం ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారు?  ఆయన ఫోన్ ఎక్కడికి వెళ్లింది? చివర్లో ఆయన మాట్లాడిన సుదీర్ఘమైన ఫోన్ కాల్ ఎవరికి చేశారు? లాంటి వాటికి సమాధానం లభించని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. ఈ ప్రశ్నల్లో కొన్నింటికి ఇప్పుడు సమాధానం లభించిందని చెబుతున్నారు. కోడెల వాడే ఫోన్ ఎక్కడికి పోలేదని.. ఆయన కుటుంబ సభ్యుల వద్దే ఉందని.. అంత్యక్రియల అనంతరం హైదరాబాద్ కు వచ్చినంతనే దాన్ని పోలీసులకు అప్పగిస్తారని చెబుతున్నారు. ఇక.. ఆత్మహత్య చేసుకోవటానికి ముందు కోడెల మాట్లాడిన ఫోన్ కాల్ మీద పోలీసులు ప్రాథమిక సమాచారాన్ని సేకరించినట్లుగా తెలుస్తోంది.

కోడెల చివరగా కేన్సర్ ఆసుపత్రికి చెందిన ఒక డాక్టర్ కు ఫోన్ చేసినట్లుగా గుర్తించారు. ఏం మాట్లాడారు? ఎందుకు ఫోన్ చేశారన్న విషయాల మీద పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. మిగిలిన ఫోన్ కాల్స్ వివరాల్ని సేకరిస్తున్న పోలీసులు.. విచారణను ముమ్మరం చేయనున్నారు. చనిపోవటానికి ముందు చేసిన ఫోన్ కాల్ ఒక డాక్టర్ కు ఎందుకు చేసినట్లు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇక.. కోడెల వాడుతున్న మందుల్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.


Tags:    

Similar News