బీజేవైఎం తేజస్వి సూర్యకు హైదరాబాద్ పోలీసుల షాక్

Update: 2020-11-26 16:40 GMT
భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్యకు హైదరాబాద్ పోలీసులు గట్టి షాకిచ్చారు. తెలంగాణలో జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటూ నిన్న ఉస్మానియా యూనివర్సిటీలోకి వెళ్లి హల్ చల్ చేసిన ఆయనపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

క్రిమినల్ ట్రెస్ పాస్ కింద తేజస్వి సూర్యపై కేసు నమోదు చేసినట్టు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలోకి ప్రవేశించడం పట్ల తేజస్వి సూర్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉస్మానియా రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. పోలీసులు అనుమతించకున్నా విద్యాసంస్థలోకి ప్రవేశించి తేజస్వి వీరంగం సృష్టించడంతో ఈ బీజేపీ కీలక నేతకు షాకిచ్చారు.

ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా తేజస్వి అనుమతులు తీసుకోలేదు. దీంతో ఆయనపై ఓయూ రిజిస్ట్రార్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్రిమినల్ ట్రెస్ పాసింగ్ కింద కేసు నమోదు చేశారు. త్వరలోనే ఆయనకు నోటీసులు పంపిస్తారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ విద్వేశాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పిన మరునాడే హైదరాబాద్ పోలీసులు ఈ చర్యకు దిగడం విశేషంగా మారింది.
Tags:    

Similar News