జగనన్న రాజ్యంలో కరెంటు కోతలు! ఎంతగానో తెలిస్తే షాకే!

Update: 2022-04-07 04:46 GMT
అవును.. మీరు చదువుతున్నది నిజమే. ఇందులో అబద్ధం అస్సలు లేదు. నమ్మకం లేకుంటే చేతిలోని సెల్ ఫోన్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలిసిన వారికి ఫోన్ చేయండి. ఇప్పుడు ఏపీలోని ఆ ఊరు.. ఈ ఊరు అన్న తేడా లేకుండా కరెంటు కోతలతో ఎంతలా సతమతం అవుతున్నారో చెబుతారు. 2015 నుంచి కరెంటు కోతలు అన్న మాట తెలియని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు.. మళ్లీ పాత రోజుల్ని గుర్తు చేసేలా రోజుకు మూడు నుంచి ఐదారు గంటలకు పైనే పట్టణాల్లో కరెంటు కోతలు ఉంటే.. గ్రామాల్లో ఏకంగా 12 నుంచి 14 గంటల పాటు కరెంటు కోతలతో జనాలకు చుక్కలు కనిపిస్తున్నాయి.
 
మండే సూరీడు.. ఉక్కపోతలతో ఒళ్లు తడిచిపోతున్న వేళలో.. ఇల్లు ఓవెన్ లా మారిపోతుంటే.. కాస్త ఉపశమనం కలిగేందుకు ఫ్యాన్ వేసుకుందామంటే కరెంటు కోతలతో సతమతమవుతున్నాయి ఏపీలోని పల్లెలు.. పట్టణాలు.. నగరాలు. దీంతో కరెంటు ఎప్పుడు వస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కరెంటు ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు పోతుందన్న కనీస సమాచారం ఇవ్వని తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకిలా? ఎందుకింత దారుణ పరిస్థితి? అంటే.. వేసవిలో ఉండే డిమాండ్ కు తగ్గట్లు అంచనాలు సిద్ధం చేసి.. ఒప్పందాలు చేసుకొని ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ.. దానిపై అధికారులు ఫోకస్ పెట్టకపోవటం ఒక ఎత్తు అయితే.. జెన్ కో థర్మల్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి అవసరమైన తగిన బొగ్గు లేకపోవటంతో ఇంతటి దారుణ పరిస్థితికి కారణమని చెబుతున్నారు.

వేసవిలో డిమాండ్ 240-250 మిలియన్ యూనిట్లలో ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. డిస్కంలు కుదుర్చుకున్న పీపీఏల ప్రకారం సుమారు 190 ఎంయూలవిద్యుత్ వస్తోంది.వేసవిలో పెరిగే డిమాండ్ కుతగ్గట్లు మరో 50 ఎంయూల అదనంగా అవసరపడతాయని తెలుసు. ఎక్సైంజీల నుంచి ఇంత భారీగా రోజువారీగా కొనటం కష్టం. అందుకే.. ముందే పీపీఏలు కుదుర్చుకుంటే సరిపోయేది.

కానీ.. అలా జరగకపోవటంతో.. కరెంటుకోతల నరకాన్ని నిత్యం చవిచూస్తున్నారు ఏపీ ప్రజలు. అనుకోని రీతిలో విదేశీ బొగ్గును తీసుకురావటంలో ప్రభుత్వం ఫెయిల్ కావటంతో విద్యుదుత్పత్తి భారీగా పడిపోయింది. ఇవన్నీకలిసి కోతలకు కారణమైనట్లు చెబుతున్నారు.

కరెంటు కోతలు ఎంత తీవ్రంగా ఉన్నాయనటానికి ఉదాహరణగా కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆరు నుంచి ఎనిమిది గంటలు కోతల్ని ప్రజలు భరించాల్సి వస్తోంది. విజయనగరం జిల్లా రామభద్రాపురంలో మంగళవారం అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు.. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కరెంటు లేని పరిస్థితి. అలా అని అన్నిచోట్లఇలానే ఉందని చెప్పట్లేదు కానీ.. ఏపీ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే ఉందని మాత్రం చెప్పక తప్పదు.
Tags:    

Similar News