పాచిపోయిన సాకే చెబుతున్న జవదేకర్!

Update: 2016-09-11 06:54 GMT
గత రెండు మూడు రోజులుగా ఏపీ రాజకీయాలు - విమర్శలు ప్రతివిమర్శలు అన్నీ "పాచిపోయిన లడ్డూల" చుట్టూ తిరుగుతున్నాయి. అర్ధరాత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ - పోలవరానికి 100% నిధులను కాకినాడ సభ వేదికగా పవన్ కల్యాణ్ రెండు పాచిపోయిన లడ్డూలతో పోల్చిన సంగతి తెలిసిందే. ఈ సభ అనంతరం పాచిపోయిన లడ్డూలు అనే మాట బాగా ఫేమస్ అయ్యింది. ప్రతిపక్షాలు కూడా ఇదే మాటతో ఆ పాచిపోయిన లడ్డూలను వెంకయ్య ఒకటి - చంద్రబాబు ఒకటి పంచుకోబోతున్నారని విమర్శలు చేస్తుండగా... ఆ పాచిపోయిన లడ్డూలను చంద్రబాబు మహాప్రసాదంగా స్వీకరించారని మరికొందరు వ్యాఖ్యానించారు. అయితే తాజాగా ఈ విషయాలపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఇచ్చినవి పాచిపోయిన లడ్డూలు కాదని మొదలుపెట్టిన కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్.. కేంద్రం ఇచ్చినవి తిరుపతి లడ్డూలు అని అన్నారు. తిరుపతి ఐఐటీ క్యాంపస్‌ ను సందర్శించిన సందర్బంగా మాట్లాడిన ప్రకాష్ జవదేకర్.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలున్నాయని "పాచిపోయిన సాకే" చెప్పారు. హోదా ఇవ్వకపోయినా ఏపీ మాకు ఎప్పుడూ ప్రత్యేకమని, ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా రాజధాని నిర్మాణానికి పర్యావరణ అనుమతులు తామే ఇచ్చామని.. అది కూడా ఒక ఘనతగా చెప్పుకున్న జవదేకర్ - ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కు రూ.10 వేల కోట్లు కేటాయించామని.. ఇదే క్రమంలో మిగిలిన మూడేళ్లలో మరో 22 వేల కోట్లు "కేటాయించే అవకాశం" ఉందని అన్నారు.
Tags:    

Similar News