ఒరిజిన‌ల్ వైసీపీ కేడ‌ర్‌ను తొక్కుతా! : ప్రకాశం ఎమ్మెల్యే

Update: 2022-09-27 09:01 GMT
ఏపీలోని అధికార పార్టీ వైసీపీలో సీఎం జ‌గ‌న్ కానీ.. కీల‌క నాయ‌కులు కానీ.. ఏం చెబుతున్నారు?  ఏం చేయా ల‌ని సూచిస్తున్నారు? అంటే.. దీనికి పెద్ద‌గా త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు అవ‌స‌రం లేదు. ప్ర‌జ‌ల్లో ఉండండి.. పార్టీ నేత ల‌ను క‌లుపుకొని పోండి.. అంద‌రూ క‌లిసి పార్టీ కోసం ప‌నిచేయండి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ.. మ‌నం అధికారం లోకి వ‌చ్చేలా కృషి చేయండి.. ఆయ‌న ప‌దే ప‌దే చెబుతున్నారు. మ‌రి క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యేలు అదే ప‌నిచేస్తున్నారా?  అధినేత మాట‌ను.. తూ.చ త‌ప్ప‌కుండా పాటిస్తున్నారా?

అంటే.. ఎవ‌రి సంగ‌తి ఎలా ఉందో తెలియ‌దు కానీ.. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఓ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే మాత్రం 'మీరు చెప్పేదేంటి?  నేను వినేదేంటి?  మీరు చెబితే మాత్రం .. నేను చేయాలా?'' అని అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. త‌ప్ప‌.. పార్టీ చెప్పిన‌ట్టు ఎక్క‌డా కేడ‌ర్‌ను క‌లుపుకొని ముందుకు సాగుతున్న ప‌రిస్థితి లేదు. పైగా.. ''కిక్కురుమంటే.. అణిచేస్తా!!'' అని పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీ కోసం.. ప‌నిచేస్తున్న‌వారికి హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నార‌ట‌.

పోనీ.. ఆయ‌నే మ‌న్నా.. పార్టీకి ఆవిర్భావం నుంచి ఉన్నారా?  వైఎస్ ఫ్యామిలీకి అత్యంత కావాల్సిన వ్య‌క్తా?  వైఎస్ అంటే ప్రాణం ఇచ్చే నాయ‌కుడా? అంటే.. ఇవేవీ ఆయ‌న‌కు వ‌ర్తించ‌వు. పైగా.. ఆయ‌న గ‌తంలో ఒక పార్టీలో ఉన్న‌ప్పుడు.. వైఎస్‌పై కాలుదువ్వారు. నువ్వెంత‌.. అంటే.. నువ్వెంత‌.. అని నోరు చేసుకున్నారు. ఒకానొక సంద‌ర్భంలో వైఎస్ దిష్టిబొమ్మ‌ను సైతం ద‌గ్గ‌రుండి ద‌హ‌నం చేయించారు. ఇక‌, మ‌రో పార్టీలో కి మారిన త‌ర్వాత‌.. జ‌గ‌న్‌పైనా నోరు పారేసుకున్నారు.

చాలా మందికి తెలుసునో లేదో.. కానీ, జ‌గ‌న్‌నుతొలిసారి 'జైలు ప‌క్షి' అంటూ..వ్యాఖ్యానించిన ఘ‌టికుడు. అయితే.. ఇవ‌న్నీ రాజ‌కీయాల్లో స‌హ‌జం అనుకున్నారో.. లేక‌.. ఆయనబ్ర‌తిమాలాడ‌ని అనుకున‌నారో.. ఏదేమైనా.. గ‌త ఎన్నిక‌ల్లో చివ‌రి నిముషంలో ప్ర‌కాశంలోని ఓ కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆయ‌న చేతిలో పెట్టారు. గెలిచాడు. గెలిచిన త‌ర్వ‌త‌..అయినా.. ఆయ‌న పార్టీకి ప‌నిచేయాలి క‌దా.. కేడ‌ర్‌ను క‌లుపుకొని పోవాలి.. క‌దా.. అదేమీ లేదు. పైగా.. క్షేత్ర‌స్థాయిలో ఎప్ప‌డి నుంచో ఉన్న నాయ‌కుల‌ను కూడా లెక్క చేయ‌డం మానేశారు.

ఎవ‌రినీ ద‌రిచేర‌నీయ‌రు. నిజానికి వైఎస్ అంటే గిట్ట‌ని వ్య‌క్తికి.. ఆయ‌న దిష్టిబొమ్మ‌లు ద‌హ‌నం చేసిన వ్య‌క్తికి, జ‌గ‌న్‌పై కారాలు మిరియాలు నూరిన వ్య‌క్తికి టికెట్ ఇవ్వ‌డాన్ని నిజ‌మైన నాయ‌కులు స‌హించ‌లేదు. అయినా.. అధినేత తీసుకున్న‌నిర్ణ‌యాన్ని గౌర‌వించి.. ఆయ‌న గెలుపు కోసం ప‌నిచేశారు. అయితే.. కొన్నాళ్లుగా అస‌లు కేడ‌ర్‌ను సైతం ప‌క్క‌న పెట్టేశారు.  దీంతో వారు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ''ఎన్నిక ల స‌మ‌యంలో కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరిగాం.. ప్ర‌చారం చేసి గెలిపించాం. కానీ, మ‌మ్మ‌ల్ని మాత్రం ఇప్పుడు పక్క‌న పెడుతున్నారు'' అని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే అస‌లు నియోజ‌క‌వ‌ర్గంలో ఏంజ‌రుగుతోంద‌నే విష‌యంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఈ విష‌యం తెలిసిన స‌ద‌రు ఫైర్ బ్రాండ్‌వెంట‌నే వారిని రావాలంటూ.. హుకుం జారీ చేశారు. దీంతో ఏం జ‌రుగుతుందో.. త‌మ మాటేమైనా వింటాడేమోన‌ని ఎన్నో ఆశ‌ల‌తో కేడ‌ర్ ఆయ‌న కార్యాల‌యానికి వెళ్లింది.  తీరా వెళ్లాక‌.. గ‌ట్టివార్నింగ్ ఇచ్చార‌ట‌., ''అధిష్టానానికి నాపైనే ఫిర్యాదులు మోస్తారా?  తొక్కేస్తా!'' అంటూ.. హెచ్చ‌రిక‌లు జారీ చేశారట‌. దీంతో కేడ‌ర్ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా ఉంది. అదిష్టానం అయినా.. త‌మ‌ను ప‌ట్టించుకోవాల‌ని.. ఈ ఎమ్మెల్యే బారి నుంచి ర‌క్షించాల‌ని వారు కోరుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News