చింత‌న్ శిబిర్‌తో కాంగ్రెస్‌కు ఒరిగిందేమీ లేదు: పీకే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2022-05-20 13:30 GMT
రాజస్థాన్‌ లోని ఉదయ్‌పూర్‌లో ఇటీవల జరిగిన కాంగ్రెస్ మేధోమథన చింత‌న్ శిబిర్‌ వల్ల ఒరిగిందేమీ లేదని ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. కేవలం యథాతథ స్థితిని కొనసాగించడానికే ఈ సమావేశాలు ఉపయోగపడ్డాయన్నారు. రానున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు.

ప్రశాంత్ కిశోర్ శుక్రవారం ట్విటర్ వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. రాజస్థాన్‌లో జరిగిన కాంగ్రెస్ నవ సంకల్ప చింతన్ శిబిర్‌ ఫలితంపై స్పందించాలని తనను చాలా మంది కోరారని చెప్పారు. ఈ సమావేశాలు ఏదైనా అర్థవంతమైనదానిని సాధించడంలో విఫలమయ్యాయన్నారు. అయితే కనీసం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో రాబోతున్న ఓటమి వరకు యథాతథ స్థితిని సాగదీయడానికి కాంగ్రెస్ నాయకత్వానికి కాస్త సమయం ఇచ్చాయన్నారు.

ప్రశాంత్ కిశోర్ ఇటీవల కాంగ్రెస్  అగ్ర నేతలతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. పార్టీ పునరుజ్జీవం కోసం వ్యూహాలపై వీరు చర్చించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరినప్పటికీ కొన్ని కారణాలను చూపుతూ ఆయన తిరస్కరించారు. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూపు సభ్యునిగా ఉండాలని ఆ పార్టీ కోరినప్పటికీ తిరస్కరించారు. పార్టీ అధ్యక్షురాలు ఇచ్చే ఆదేశాల మేరకు ఏర్పడే ఈ గ్రూపునకు పార్టీలో పెద్దగా అధికారం ఏమీ ఉండదని తన అభిప్రాయమని చెప్పారు.

ఇదిలావుండగా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో జరగవచ్చు. గుజరాత్‌లో కాంగ్రెస్ కీలక నేత హార్దిక్ పటేల్   ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా సమర్పించారు. దీంతో గుజ‌రాత్‌లో కాంగ్రెస్ ఆశ‌లు దెబ్బ‌తిన్నాయి. అదేస‌మ‌యంలో ప‌టేల్ చేసిన వ్యాఖ్య‌లుయువ‌త‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతాయ‌ని కాంగ్రెస్ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News