చేతులు ముడుచుకోలేదంటున్న పత్తిపాటి

Update: 2016-05-02 04:10 GMT
ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ఆచితూచి స్పందించే ఏపీ తెలుగు తమ్ముళ్లు మొహమాటాల్ని పక్కన పడేసినట్లుగా కనిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర సహాయ మంత్రి చేసిన వ్యాఖ్యలపై వివిధ రాజకీయ పక్షాలు విరుచుకుపడటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ్ముళ్లు సైతం నోటికి పని చెప్పటం షురూ చేశారు. ప్రత్యేకహోదా మీద ఇప్పటికే పలుమార్లు..కేంద్రమంత్రులు సాధ్యం కాదన్నమాటను పరోక్షంగా చెప్పేస్తే.. ఇటీవల చౌదరి కుండబద్ధలు కొట్టేయటం తెలిసిందే.

ఏపీ భవిష్యత్తుకు ప్రత్యేక హోదా ఎంతో అవసరమైన నేపథ్యంలో.. ఈ విషయం మీద వెనక్కి తగ్గితే పుట్టగతులు ఉండవన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు అర్థం చేసుకున్నట్లే కనిపిస్తోంది. మిత్రధర్మం అంటూ కేంద్రం మీద కటువుగా మాట్లాడలేని అధినేత ఇబ్బందిని గుర్తించిన తమ్ముళ్లు తమ నోటికి పని చెబుతున్నట్లుగా కనిపిస్తోంది. నిన్నటికి నిన్న జలీల్ ఖాన్ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల సైకిల్ ఎక్కేసిన ఎమ్మెల్యే) మోడీ సర్కారు మీద మండిపడితే.. తాజాగా అదే బాట పట్టారు ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు.

కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్నంత మాత్రాన తాము చేతులు ముడుచుకొని కూర్చోలేదని.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోడీ కానీ నో అంటే ప్రత్యక్ష కార్యాచరణకు తాము ప్రారంభిస్తామని వార్నింగ్ తరహాలో మాట్లాడటం గమనార్హం. రాష్ట్రం ఎదిగేందుకు ప్రత్యేక హోదా అత్యవసరమన్న పత్తిపాటి.. ప్రత్యేక హోదాతో పాటు.. చాలానే హామీలు విభజన బిల్లు సమయంలో ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ప్రత్యేక హోదాకు నో అంటే.. ఫైటింగ్ కు రెఢీ అంటున్న పత్తిపాటి మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకెంతమంత్రి తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోతారో చూడాలి.
Tags:    

Similar News