దేశానికి రాష్ట్రపతి.. వెంకయ్యకు ఇష్టం ఉందా? లేదా?

Update: 2022-03-29 14:48 GMT
ఒక తెలుగు వ్యక్తి దేశాన్ని ఏలాలని.. అగ్రస్థానంలోకి చేరాలని చాలా మంది కోరిక. ఆ లోటును గతంలో పీవీ నరసింహారావు తీర్చారు. ఆయన దేశానికి కొత్త ఆర్థిక సంస్కరణలు నేర్పిన గొప్ప ప్రధానిగా పేరుతెచ్చుకున్నారు. ఇప్పుడు పీవీ తర్వాత దేశ అత్యున్నత పీఠంపై కూర్చునే అవకాశం వెంకయ్యనాయుడుకు దక్కాలన్న ఆశ అందరికీ ఉంది. ఇప్పటికే దేశంలో రాష్ట్రపతి తర్వాత కీలకమైన ఉపరాష్ట్రపతి పదవిని వెంకయ్య చేపట్టారు. ఇక ఇప్పుడు ఆయన రాష్ట్రపతి కావాలని ప్రతి తెలుగు వారు కోరుకుంటున్నారు.

భావి భారత రాష్ట్రపతి కాబోయే అభ్యర్థి వెంకయ్యనాయుడేనని కొద్దిరోజులుగా తెగ ప్రచారం సాగుతోంది. ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగిసాక.. కొత్త రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడును ఎన్నుకోబోతున్నారని జోరుగా బీజేపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. వచ్చేది పొత్తుల కాలం కావడంతో రాజకీయ అనుభవం గల వెంకయ్యనే రాష్ట్రపతిగా కొనసాగాలని బీజేపీ భావిస్తున్నట్టు టాక్.

అయితే రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరును బీజేపీ ప్రతిపాదించిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన కార్యాలయమే తేల్చిచెప్పింది. ఈ మేరకు ఉప రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇక తెలుగు వ్యక్తి అయిన వెంకయ్య రాష్ట్రపతి కావాలన్న డిమాండ్ మన నేతల నుంచే వస్తోంది. అప్పట్లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో కలిసి పాల్గొన్న సమయంలో  మెగాస్టార్ చిరంజీవి ఏకంగా ఆయన ముందే వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అయితే బాగుంటుందని అన్నారు.  కొన్ని రోజుల కిందట చిరంజీవి తమ్ముడు నాగబాబు రతన్ టాటా కు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వాలని కోరారు.

అయితే వెంకయ్యనాయుడు మనోభీష్టం వేరు. ఆయనకు ఈ ఉత్సవ విగ్రహాల్లాంటి పదవుల కంటే ప్రజాసేవ చేయాలనే ఉందని ఆ మధ్య నెల్లూరు, హైదరాబాద్ పర్యటనల్లో చెప్పుకొచ్చారు. ‘తనకు నేరుగా ప్రజా సేవ చేయాలని ఉందని, ప్రజలతో మమేకమై ఉంటేనే ఆనందంగా ఉంటుందని అన్నారు. ఇప్పుడున్న ఉప రాష్ట్రపతి పదవి తనకు ఇష్టం లేదనే విషయాన్ని ఆయన పరోక్షంగా తెలిపారు. అయితే ఇదే సమయంలో ప్రజలు తనను రాష్ట్రపతిగా చూడాలని అనుకుంటున్నారని అన్నారు. దీంతో ఆయనకు రాష్ట్రపతి కావాలన్న ఆకాంక్ష మదిలో ఉన్నట్లు క్లారిటీ వచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్లినా అనునాయులు రాష్ట్రపతి కావాలని కోరుతున్నారు.

వచ్చే సంవత్సరం రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బీజేపీలో ఆసక్తికరంగా మారింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన సమయంలో కాంగ్రెస్ కు చెందిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నారు. అయితే ఆయనపై బీజేపీకి ఉన్న మంచి అభిప్రాయంతో ప్రణబ్ ను చివరి వరకు కొనసాగించారు. ఆ తరువాత ఎవరూ ఊహించని విధంగా పార్టీలో లేని వ్యక్తి, దళిత వర్గానికి ప్రాధాన్యత క్రమంలో రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. వాస్తవానికి రాష్ట్రపతి కావాలని చాలా మంది పార్టీ నాయకులే కోరుతారు. కానీ బీజేపీ వ్యూహంలో భాగంగా దళిత వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ ను నియమించి కొన్ని విమర్శల నుంచి తప్పించుకుంది.

ఇక రాజకీయ మార్పుల నేపథ్యంలో కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయడుకు ఉపరాష్ట్రపతిగా అవకాశం ఇచ్చారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఇష్టం లేదని, బలవంతంగా ఈ పోస్టును కట్టబెట్టారని కొందరు అంటుంటారు. కానీ ఇన్ని రోజులు ఎలాంటి వ్యాఖ్యలు చేయని వెంకయ్య  రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికరంగా తాను రాష్ట్రపతి అభ్యర్థి అన్నది.. ఒట్టి ప్రచారం అనడం మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.  

ఉన్నత పదవుల విషయంలో కేంద్రంలో ఊహించిన విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. పార్టీలో ఎక్కువ పరిచయం లేని వారికి ఉన్నత పదవులు ఇస్తూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా రాష్ట్రపతి విషయంలో కేంద్రం ఓ అంచనాకు వచ్చినట్లే తెలుస్తోంది. అయితే పార్టీలోని వ్యక్తులకు కాకుండా ఇతర రంగాల్లో ప్రముఖులకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తున్నారు. 2002లో అటల్ బీహార్ వాజ్ పేయి సమయంలోనూ ఎవరూ ఊహించని విధంగా అబ్దుల్ కలాం ను రాష్ట్రపతిగా చేశారు. ఆయన శాస్త్రవేత్తగా అందరికీ పరిచయమే. కానీ ఏ పార్టీలోనూ చేరలేదు. దీంతో ఆయన ప్రతిభను గుర్తించి రాష్ట్రపతిని చేశారు.

ఇప్పుడు కూడా బీజేపీ అదే ఆలోచిస్తుందని కొందరు పార్టీలోని ముఖ్యులు అంటుంటారు.  ఇటీవల రతన్ టాటా తన సంపాదనలో సగం ప్రజా సేవకే ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆయన భారత దేశానికి చేసిన సేవలకు గుర్తింపునకు గాను ఆయనకు అవకాశం ఇస్తారా..? లేదా సీనియర్ వెంకయ్యకు అవకాశం ఇస్తారా? అన్న చర్చ సాగుతోంది.
Tags:    

Similar News