రాహుల్ గాంధీ మీద పెద్ద బాంబే వేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం

Update: 2022-06-03 04:28 GMT
కాంగ్రెస్ పార్టీని ఎవరో ప్రత్యేకంగా టార్గెట్ చేసి దెబ్బ తీయాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ పుట్టె ముంచేయటానికి కాంగ్రెస్ నేతలు సరిపోతారు. పదేళ్ల పాటు దేశంలో తిరుగులేని రాజకీయ పార్టీగా వ్యవహరించిన కాంగ్రెస్.. జాతీయ రాజకీయాల్లోకి నరేంద్ర మోడీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. గతంలో తాను ఎప్పుడూ ఎదుర్కోలేనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.

క్యాలెండర్ లో రోజులు గడుస్తున్నకొద్దీ.. కాంగ్రెస్ ప్రాభవం తగ్గిపోతుంటే.. బీజేపీ మాత్రం అందుకు భిన్నంగా వెలిగిపోతోంది. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో కాంగ్రెస్ నేతల నోటి నుంచి వచ్చే మాటలు చాలు.. ఆ పార్టీ తనకు తానుగా కాలిపోవటానికి. ఎంత చెప్పినా వినని అసంతృప్త నేతల వ్యాఖ్యలు పార్టీకి భారంగా మారటమే కాదు.. దారుణమైన డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది.

తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కమ్ మహారాష్ట్ర సీనియర్ నేత ప్రథ్వీరాజ్ చౌహాన్. కాంగ్రెస్ అసంతృప్త నేతలంతా కలిసి ఒక కూటమి ఏర్పాటు చేయటం.. దానికి జీ-23గా గుర్తింపు పొందిన ఈ టీంలో చౌహాన్ ఒకరు. తాజాగా ఉదయ్ పూర్ లో జరిగిన చింతన్ శిబిర్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సొంత పార్టీపై విరుచుకుపడ్డారు.   చింతన్ శిబిర్ పేరుతో సదస్సును నిర్వహిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆత్మపరిశీలన మాత్రం జరగటం లేదని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. పార్టీ కీలక నేతల్లో ఒకరైన రాహుల్ గాంధీని గడిచిన నాలుగేళ్లలో కలుసుకోవటం సాధ్యం కాలేదన్నారు. అదే సమయంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను తాను ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ కలవటం సాధ్యమవుతుందని.. కానీ రాహుల్ గాంధీని మాత్రం కలవలేకపోయినట్లుగా చెప్పిన వైనం ఇప్పుడు కలకలానికి దారి తీసింది. అనారోగ్యంతో ఉన్నప్పటికి మన్మోహన్ కలిసేవారని.. సోనియాగాంధీతోనూ తాను భేటీ కాగలుగుతానని చెప్పిన చౌహాన్.. రాహుల్ తో మాత్రం భేటీ కాలేకపోయినట్లు వెల్లడించారు.

పార్టీ అధిష్ఠానం అందరికీ అందుబాటులో ఉండాల్సినంతగా ఉండటం లేదనే అభిప్రాయం ఉందన్న ఆయన.. ‘‘ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా మాజీ ప్రధాని మన్మోహన్ ను కలుస్తా. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఇంతకు ముందులా లేదు. ఎప్పుడు వెళ్లినా అతిధ్యంతో పాటు మాట్లాడేందుకు సిద్ధంగా ఉండేవారు’’ అన్నచౌహాన్ రాహుల్ మీద తనకున్న అసంతృప్తిని బాహాటంగానే కక్కేశారు. సమస్యలపై లోతుగా పరిశీల చేయటం లేదన్న ఆయన.. కేవలం భవిష్యత్తు మీదనే ఫోకస్ చేయాలని భావిస్తోందన్నారు.

కేరళ.. అసోం ఎన్నికల్లో పార్టీ పరాజయాల మీద కమిటీ నివేదికను తెప్పించినప్పటికీ.. దాన్ని బీరువాలో దాచి ఉంచారన్నారు. నిజాయితీగా సలహాలు ఇచ్చే వారిని పార్టీ దూరం పెట్టి.. కేవలం నామినేటెడ్ వ్యక్తులు ఇచ్చిన సూచనల్ని మాత్రమే కాంగ్రెస్ అధిష్ఠానం ఇష్టపడుతుందన్నారు. మొత్తానికి రాహుల్ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసేలా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు. మరి.. ఈ తరహా అసంతృప్తి రోగంతో ఇబ్బంది పడుతున్ననేతలకు రాహుల్ ఎలాంటి మందు వేసి కట్టడి చేస్తారో చూడాలి.
Tags:    

Similar News