ఐడియా ఎవ‌రిదో కానీ మోడీషాల‌కు భారీ షాక్!

Update: 2018-05-20 07:32 GMT
ఆశ ఫ‌ర్లేదు. అత్యాశ‌తోనే ఇబ్బందంతా. ఇదే విష‌యాన్ని క‌ర్ణాట‌క రాజ‌కీయం మ‌రోసారి నిరూపించింది. మోతాదుకు మించిన ఆశ‌తో క‌ల‌లు సాకారం కావ‌టం సంగ‌తి త‌ర్వాత‌.. అస‌లుకే ఎస‌ర‌న్న విష‌యం రాజ‌కీయ పార్టీల‌కు అర్థ‌మై ఉంటుంది. మిగిలిన వారి సంగ‌తి ఎలా ఉన్నా.. త‌మ వ్యూహాల‌కు తిరుగులేద‌ని భావించే మోడీషాలకు మాత్రం భారీ ఎదురుదెబ్బ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

క‌ర్ణాట‌క ఎపిసోడ్‌లో క‌మ‌ల‌నాథుల‌కు భారీ ఎదురుదెబ్బ ఎందుకు త‌గిలింది?  డామిట్.. క‌థ ఎందుకు అడ్డం తిరిగిందని ఎందుకు అనుకోవాల్సి వ‌చ్చింది? అన్న‌ది చూస్తే.. కాంగ్రెస్ వేసిన వ్యూహ ఫ‌లిత‌మేన‌ని చెప్పాలి. ముఖ్యమంత్రి ప‌ద‌వికి ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రెండు రోజుల వ్య‌వ‌ధికే త‌న‌కు తానే రాజీనామా చేసే వ‌ర‌కూ వెళ్ల‌టానికి కార‌ణం.. క‌ర్ణాట‌క వ్య‌వ‌హారంపై సుప్రీంను ఆశ్ర‌యించాల‌నే ప్లాన్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

అదిరిపోయేలాంటి ఈ ఐడియా ఎవ‌రిది? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది. క‌ర్ణాట‌క గేమ్ ఛేంజ‌ర్ కావ‌టానికి సుప్రీంను ఆశ్ర‌యించ‌ట‌మే. అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత సుప్రీం త‌లుపులు తెరిచి..త‌మ పిటిష‌న్ ను  విచారించాలంటూ అభిషేక్ సింఘ్వి చేసిన విన‌తి ఈ వ్య‌వ‌హారానికి కీల‌కంగా చెప్పాలి.

అప్ప‌టిక‌ప్పుడు గ‌వ‌ర్న‌ర్ చ‌ర్య‌ను త‌ప్పుప‌డితే ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదురుకాక త‌ప్ప‌ద‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానానికి తెలియంది కాదు. అదే స‌మ‌యంలో త్రాసును స‌రి చేసే ప్ర‌క్రియ‌లో భాగంగా తొలుత‌.. య‌డ్డి ప్ర‌మాణానికి అడ్డు చెప్ప‌ని సుప్రీం.. పెట్టాల్సిన మెలిక పెట్టింది. య‌డ్డీ ప్ర‌మాణం మొత్తం త‌మ తుది తీర్పున‌కు లోబ‌డి ఉంటుంద‌న్న విష‌యాన్ని అత్యున్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది.

ఈ మాట య‌డ్డీ సర్కారుకు ఇబ్బందిగా మారితే.. దీనికి మించిన మ‌రో అంశం మొత్తం సీన్ మారిపోయేందుకు కార‌ణ‌మైంది. య‌డ్డీ ప్ర‌భుత్వం త‌మ బ‌లాన్ని నిరూపించుకోవ‌టానికి వారం గ‌డువు ఇవ్వాల‌ని కోరితే.. క‌ర్ణాట‌క గ‌వ‌ర్న‌ర్ సార్ మాత్రం.. వారం కాదు.. ప‌దిహేను రోజుల గ‌డువు తీసుకోండంటూ చెప్పిన మాట‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది కాంగ్రెస్‌. ఇదే విష‌యాన్ని మ‌రోసారి సుప్రీం దృష్టికి వెళ్ల‌టం.. ఆ వెంట‌నే స్పందించిన సుప్రీం..  15 రోజుల గ‌డువును కాస్తా 29 గంట‌ల‌కు కుదించింది. ఇదే.. క‌ర్ణాట‌క సీన్ మొత్తం మారిపోవ‌టానికి కార‌ణంగా చెప్పాలి.

స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో 8 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు పొంద‌టం ఒక ఎత్తు అయితే.. నాలుగైదు పార్టీలు ఉంటే లెక్క‌లు తేలిపోయేవి. కానీ.. ఉన్న రెండు పార్టీల్లో జేడీఎస్ ఎమ్మెల్యేలు మ‌హా క‌ర‌కుగా ఉండ‌టం.. కాస్తో.. కూస్తో బేరాల‌కు సానుకూలంగా స్పందించే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించిన వైనం చివ‌ర‌కు అర్థ‌మైంది. దీంతో.. తమ‌కు అవ‌స‌ర‌మైన 8 మంది ఎమ్మెల్యేల్ని త‌మ వైపు తిప్పుకునేందుకు ఎంత ప్ర‌య‌త్నించినా సాధ్యం కాలేదు. ఇదే.. య‌డ్డీ స‌ర్కారు రెండు రోజుల్లో ఆయుష్షు తీరిపోయేలా చేసింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. సుప్రీంను ఆశ్ర‌యించాల‌న్న ఐడియా.. సోనియాగాంధీ.. ప్రియాంక వాద్రాదిగా చెబుతున్నారు. దానికి తుది మెరుగులు దిద్ది.. మొత్తంగా మారిపోయేలా చేయ‌టంలో అభిషేక్ సింఘ్వి కీల‌క‌పాత్ర పోషించార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.
Tags:    

Similar News