నయా ఫిక్సింగ్: క్యురేట్ అడ్డంగా దొరికాడు

Update: 2017-10-25 10:12 GMT
భారత క్రికెట్లో మళ్లీ ఫిక్స్ కలకలం రేగింది. ఐతే ఇందులో ఆటగాళ్లకేమీ పాత్ర లేదు. మ్యాచ్ కు పిచ్ ను సిద్ధం చేసే క్యురేటర్ ఫిక్సింగ్ కు సిద్ధమై స్టింగ్ ఆపరేషన్లో దొరికిపోయాడు. భారత్- న్యూజిలాండ్ రెండో వన్డే కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఈ సంచలన విషయం బయటికి వచ్చింది. పుణెలో జరగనున్న ఈ మ్యాచ్‌ కు క్యురేటర్‌ గా వ్యవహరిస్తున్న సాల్గాంకర్ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఇండియా టుడేకు చెందిన ఇద్దరు విలేకరులు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో అతను దొరికిపోయాడు. తాము బుకీలమని పరిచయం చేసుకున్న ఆ విలేకరులిద్దరూ.. పిచ్ విషయంలో తమకు కొంచెం సహకరించాలని కోరారు. సాల్గాంకర్ వాళ్లు ఎవరు ఏంటని చూడకుండా వాళ్లు కోరినట్లు చేయడానికి అంగీకరించాడు.

ఐసీసీ.. బీసీసీఐ నిబంధనల ప్రకారం మ్యాచ్ అధికారులు- ఆటగాళ్లు మినహా బయటి వ్యక్తులెవరూ పిచ్ దగ్గరికి వెళ్లకూడదు. కానీ క్యురేటర్ ఆ ఇద్దరు వ్యక్తుల్ని పిచ్ దగ్గరికి తీసుకెళ్లాడు. రెండో వన్డేకు ఆతిథ్యమివ్వనున్న పిచ్ ఎలా ఉందో చూపించాడు. వాళ్లు పిచ్‌ను పరిశీలించడానికి అనుమతించారు. పిచ్ మీద కొంచెం బౌన్స్ కావాలని ఇద్దరు ఆటగాళ్లు కోరుతున్నారని.. అందుకు తగ్గట్లుగా పిచ్‌ ను సిద్ధం చేయాలని అడగ్గా.. అందుకు సాల్గాంకర్ అంగీకరించాడు. అంతే కాక ఈ పిచ్‌ పై 337 దాకా స్కోరు అయ్యే అవకాశముందని చెప్పాడు. అంత స్కోరు అయినా దాన్ని ఛేదించేందుకు కూడా ఆస్కారముందని వాళ్లకు తెలిపాడు. ఇలా పిచ్ గురించిన సమాచారమంతా వాళ్లకు ఇవ్వడంతో పాటు.. వాళ్లు కోరినట్లుగా పిచ్‌ ను మార్చడానికి కూడా సాల్గాంకర్ అంగీకరించాడు. బుధవారం ఉదయం ఈ స్టింగ్ ఆపరేషన్‌ కు సంబంధించిన వీడియోను ఇండియా టుడే బయటపెట్టింది. ఇది బీసీసీఐకి తీవ్ర ఇబ్బంది కలిగించే విషయమే. సాల్గాంకర్‌ ను మహారాష్ట్ర క్రికెట్ సంఘం వెంటనే సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంపై విచారించి తదుపరి చర్యలు చేపడతామని ఆ సంఘం ప్రకటించింది.
Tags:    

Similar News