రాష్ట్రప‌తి ఎన్నిక‌లో వైసీపీ ఓటింగే కీల‌క‌మ‌ట‌!

Update: 2017-07-03 05:28 GMT
ఏపీలో విపక్ష హోదాలో ఉన్న వైసీపీపై అటు అధికార టీడీపీతో పాటు ఇటు మొన్న‌టి ఎన్నిక‌ల్లో సింగిల్ సీటు సాధించ‌ని కాంగ్రెస్ పార్టీ కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో కేవ‌లం అతి త‌క్కువ ఓటింగ్ శాతంతోనే వైసీపీ ఓడిపోయింద‌న్న విష‌యాన్ని కూడా గుర్తించ‌ని కాంగ్రెస్ పార్టీ అప్పుడ‌ప్పుడు ఘాటు విమ‌ర్శ‌లే చేస్తోంది. అయితే లోక్ స‌భ‌లో 9 మంది ఎంపీల‌తో పాటు కొత్త పార్టీ అయినా రాజ్య‌స‌భ‌లో ఓ సీటును సంపాదించుకున్న వైసీపీ విలువ ఏమిటో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గుర్తుకు వ‌చ్చిన‌ట్టుంది. ఇక అస‌లు విష‌యంలోకి వెళితే... ప్ర‌స్తుతం రాష్ట్రప‌తి ఎన్నిక‌కు సంబంధించి అటు బీజేపీతో పాటు ఆ పార్టీ అభ్య‌ర్థి రామ్‌ నాధ్ కోవింద్‌ పై లోక్ స‌భ మాజీ స్పీక‌ర్ మీరా కుమార్‌ ను బ‌రిలోకి దింపిన కాంగ్రెస్ పార్టీ కూడా గ‌ట్టి పోటీ ఇచ్చేందుకే అందుబాటులో ఉన్న అన్ని అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.

ఈ క్ర‌మంలో నిన్న న‌వ్యాంధ్ర పీసీసీ చీఫ్ - మాజీ మంత్రి ఎన్‌. ర‌ఘువీరారెడ్డి... ఓ బ‌హిరంగ లేఖ‌ను విడుద‌ల చేశారు. వైసీపీ అధినేత‌ - ఏపీలో విప‌క్ష నేత‌గా ఉన్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి రాసిన లేఖ‌లో ర‌ఘువీరా ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు సంబంధించిన పోలింగ్‌ లో వైసీపీ ఎంతో కీల‌క‌మైన పార్టీగా ఆయ‌న వైసీపీని అభివ‌ర్ణించారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌లో ఎన్డీయేకు త‌న అభ్య‌ర్థిని సొంతంగా గెలిపించుకునేంత స్తోమ‌త లేద‌ని ఆయ‌న తేల్చేశారు. ఈ క్ర‌మంలో ఏకంగా 10 మంది ఎంపీల బ‌ల‌మున్న వైసీపీ లాంటి పార్టీలు కీల‌క భూమిక పోషించే అవ‌కాశాలున్నాయ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. రాష్ట్రప‌తి ఎన్నికకు సంబంధించిన పోలింగ్ లో 10 మంది ఎంపీల బ‌ల‌మున్న పార్టీల‌కు ఏ మేర విలువ ఉంటుందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అది కూడా అధికార కూట‌మిగా ఉన్న ఎన్డీఏ... త‌న అభ్య‌ర్థిని గెలిపించుకునేంత మేర బ‌లం లేన‌ప్పుడు వైసీపీ లాంటి పార్టీల ఓటింగే కీల‌క‌మ‌ని చెప్పొచ్చు.

వైసీపీ గ‌నుక ఎన్డీఏ అభ్య‌ర్థికి కాకుండా యూపీఏ అభ్య‌ర్థికి ఓటు వేస్తే... రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ఫ‌లితాల్లో పెద్ద మార్పే వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఇదే విష‌యాన్ని గుర్తించిన ర‌ఘువీరా... నిన్న జ‌గ‌న్‌ కు లేఖ రాశారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌కు సంబంధించి వైసీపీ కీల‌క పార్టీనేన‌ని, అయితే ఆ పార్టీ ఎన్డీఏ అభ్య‌ర్థికి కాకుండా లోక్ స‌భ‌కు తొలి మ‌హిళా స్పీక‌ర్‌ గానే కాకుండా గ‌తంతో కేంద్ర మంత్రిగానూ స‌మ‌ర్థంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన మీరా కుమార్‌ కు ఓటు వేయాల‌ని అభ్య‌ర్థించారు. దివంగ‌త ఉప ప్ర‌ధాని జ‌గ్జీవ‌న్ రామ్ కుమార్తెగా మీరా కుమార్ కు రాజ్యాంగంపై మంచి ప‌ట్టు ఉంద‌ని, ఆమెను రాష్ట్రప‌తిగా గెలిపించుకుంటే మెరుగ్గా రాణించ‌గ‌ల‌ర‌ని, ఆమెకే ఓటు వేసే అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని జ‌గ‌న్‌ కు ర‌ఘువీరా విజ్ఞ‌ప్తి చేశారు. అయితే రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో వైసీపీ త‌న మ‌ద్ద‌తును ఇప్ప‌టికే ఎన్డీఏకు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించిన ర‌ఘువీరా... ఎన్డీఏకు మ‌ద్ద‌తిచ్చిన విష‌యాన్ని జ‌గ‌న్ మ‌రోమారు ప‌రిశీలించాల‌ని కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News