ఎగ్జిట్ పోల్స్ లైట్ తీసుకున్న రాహుల్‌

Update: 2017-03-10 10:16 GMT
దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిని రేకెత్తించిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌పై వ‌చ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ ను కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీ లైట్ తీసుకున్నారు. యూపీలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవ‌త‌రిస్తుంద‌న్న ఎగ్జిట్‌పోల్స్ జోస్యాన్ని రాహుల్ త‌ప్పుప‌ట్టారు. బీహార్‌ లోనూ ఎగ్జిట్‌ పోల్స్ ఇలాగే చెప్పాయ‌ని, ఫ‌లితం మాత్రం వేరే వ‌చ్చింద‌ని ఆయ‌న గుర్తుచేశారు. రెండేళ్ల కింద‌ట బీహార్‌ లో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌బోతున్న‌ద‌ని ఎగ్జిట్‌ పోల్స్ చెప్పినా.. నితీష్‌ కుమార్ నేతృత్వంలోని జేడీయూ - ఆర్జేడీ - కాంగ్రెస్ కూట‌మి ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.  వాటిని ఉద‌హ‌రిస్తూ "యూపీలో కాంగ్రెస్‌-ఎస్పీ కూట‌మి గెలుస్తుంది. మిగ‌తా వివ‌రాలు రేపు మాట్లాడుకుందాం" అని రాహుల్ అన్నారు. సోనియా చికిత్స కోసం విదేశాల‌కు వెళ్ల‌డంతో ఇప్పుడు ఫలితాల రోజు కీల‌క నిర్ణ‌యాల‌న్నీ రాహులే తీసుకోనున్నారు.

కాగా, యూపీ ఎన్నిక‌ల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవ‌త‌రిస్తుంద‌ని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ స‌ర్వేలు అంచనా వేశాయి. కాంగ్రెస్‌, ఎస్పీ కూట‌మి రెండోస్థానానికి ప‌రిమిత‌మ‌వుతుంద‌ని అవి స్ప‌ష్టంచేశాయి. అటు ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ తో బెంబేలెత్తిన ఎస్పీ సీఎం అభ్య‌ర్థి అఖిలేష్ యాద‌వ్‌.. యూట‌ర్న్ తీసుకున్నారు. ఫ‌లితాల త‌ర్వాత బీఎస్పీతో పొత్తు ఉండ‌ద‌ని గ‌తంలో చెప్పిన ఆయ‌న‌.. ఇప్పుడు బీజేపీకి వ్య‌తిరేకంగా అన్ని ప్రాంతీయ పార్టీల‌ను ఏకం చేసే ప‌నిలో ఉన్నారు. ఏ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ లేకుండా హంగ్ అసెంబ్లీ ఏర్ప‌డితే.. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అన్ని మార్గాల‌ను అన్వేషిస్తాన‌ని అఖిలేష్ చెప్పారు. యూపీని బీజేపీ రిమోట్‌ కంట్రోల్‌ తో పాలించే రాష్ట్ర‌ప‌తి పాల‌న‌ను ఎవ‌రూ కోరుకోవ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News