కేసీఆర్‌కు సురుకు పుట్టించేలా రాహుల్ స‌భ‌!

Update: 2017-05-11 07:13 GMT
ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోవాల‌న్న త‌ప‌న‌తో.. ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల్ని ఎదుర్కొని మ‌రీ తెలంగాణ రాష్ట్ర స్వ‌ప్నాన్ని సంపూర్ణం చేసిన కాంగ్రెస్ పార్టీకి.. ఎలాంటి రాజ‌కీయ ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌లేద‌న్న‌ది నిజం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వ‌టం ద్వారా ఏపీలో పార్టీని స‌మాధి చేసేందుకు సైతం వెనుకాడ‌ని కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం అందుకు బ‌దులుగా తెలంగాణ రాష్ట్రంలో త‌మ‌కు తిరుగులేని ప్ర‌జాద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని ఆశించింది. అయితే.. అధినాయ‌క‌త్వ ఆశ‌ల‌కు భిన్నంగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో తెలంగాణ‌లో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ ఎస్ పార్టీ ప‌వ‌ర్ లోకి రావ‌టం తెలిసిందే.
అధికారంలోకి వ‌చ్చినా.. ప్ర‌జ‌ల్లో అంత‌గా ప్ర‌భావం చూపించ‌లేర‌న్న పిచ్చి లెక్క‌లో ఉన్న కాంగ్రెస్‌కు దిమ్మ తిరిగిపోయేలా కేసీఆర్ ప‌న్నుతున్న వ్యూహాల‌తో ఆ పార్టీ నేత‌ల్లో నిరాశ‌.. నిస్పృహ‌ల్లో కూరుకుపోతున్న ప‌రిస్థితి. రోజులు గ‌డుస్తున్న‌కొద్దీ.. అంత‌కంత‌కూ బ‌లోపేతం అవుతున్న తెలంగాణ అధికార‌ప‌క్షానికి చెక్ చెప్పేలా.. ఈ మ‌ధ్య‌నే  కాంగ్రెస్ నేత‌లు గ‌ళం విప్పుతున్నారు.

ఇప్పుడు కానీ తాము నోరు విప్ప‌కుంటే.. భ‌విష్య‌త్తులో ఎలాంటి అవ‌కాశం ఉండ‌ద‌న్న భయాందోళ‌న‌ల న‌డుమ కేసీఆర్ స‌ర్కారు చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల మీద ప్ర‌జా ఉద్య‌మాల్ని కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నాల్ని ఈ మ‌ధ్య‌న ముమ్మ‌రం చేశారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ మీద తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ.. కేసీఆర్ స‌ర్కారుపై న్యాయ‌పోరాటం చేస్తున్న కాంగ్రెస్ నేత‌లు.. రానున్న రోజుల్లో మ‌రింత దూకుడు పెంచాల‌ని భావిస్తున్నారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు రెండేళ్ల వ్య‌వ‌ధికి త‌గ్గిపోవ‌టం.. ఒక‌వేళ ముంద‌స్తు కానీ చోటు చేసుకుంటే మ‌రింత ముందుగా ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో.. త‌న బలాన్ని ప్ర‌ద‌ర్శించే ప్ర‌య‌త్నాల‌కు తెర తీసిన‌ట్లుగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ‌దినోత్స‌వ‌మైన జూన్ 2ను ఇప్ప‌టివ‌ర‌కూ త‌న‌కు అనుకూలంగా మార్చుకోలేక‌పోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించాల‌ని డిసైడ్ అయిన‌ట్లుగా చెబుతున్నారు.

జూన్ 2న రాష్ట్ర ఆవ‌ర‌ణ‌ను పుర‌స్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ చేత బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించాల‌ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు నిర్ణ‌యించారు. త‌మ అభిలాష‌ను రాహుల్ ముందు పెట్ట‌గా ఆయ‌న సానుకూలంగా స్పందించిన‌ట్లుగా తెలుస్తోంది. ఎన్నిక‌లు రెండేళ్ల‌కు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ‌.. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్లాల‌ని భావిస్తున్న కాంగ్రెస్‌.. జూన్ 2న టీఆర్ఎస్‌కు బ‌లమైన ప్రాంతాల్లోనే స‌భ‌ను పెట్టాల‌ని భావిస్తున్న‌ట్లుగా కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు. ఇందులో భాగంగా వ‌రంగ‌ల్‌.. సంగారెడ్డి.. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాల్లో స‌భ‌ను నిర్వ‌హించాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. మ‌రో ఆస‌క్తిక‌ర వాద‌న కూడా కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది. ఎక్క‌డైతే కేసీఆర్ ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తారో.. ఆయ‌న ప‌ట్ల వ్య‌తిరేక‌త ఉందో అక్క‌డే రాహుల్ తో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌టం ద్వారా.. త‌మ స‌త్తా చాటాల‌ని కాంగ్రెస్ భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీని అమ‌లు చేసే విష‌యంలో కేసీఆర్ స‌ర్కారు ఫెయిల్ అయిన‌ట్లుగా ఉస్మానియా వ‌ర్సిటీ విద్యార్థులు భావిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల జ‌రిగిన శ‌తాబ్ది ఉత్స‌వాల సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి నోరు విప్ప‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. విద్యార్థుల నుంచి వ‌చ్చే వ్య‌తిరేక‌త‌ను గుర్తించే.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడ‌లేద‌న్న వాద‌న‌ను ప‌లువురు వినిపించారు. అందుకు త‌గ్గ‌ట్లే కేసీఆర్ మౌనంగా ఉండిపోవ‌టం ఆస‌క్తిక‌ర చ‌ర్చ చేగింది

ఇదిలా ఉండ‌గా.. కేసీఆర్ ను తీవ్రంగా వ్య‌తిరేకించే ఉద్య‌మ పురిటిగ‌డ్డ అయిన ఉస్మానియా వ‌ర్సిటీని వేదిక‌గా చేసుకొని.. రాహుల్ చేత స‌భ‌ను నిర్వ‌హిస్తే దాని కార‌ణంగా వ‌చ్చే మైలేజ్ భారీగా ఉంటుంద‌ని కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి.. వారి ఆలోచ‌న‌లు వాస్త‌వంలో ఎంత‌మేర వ‌ర్క్ వుట్ అవుతాయ‌న్న‌ది కాల‌మే తేల్చాలి.
Tags:    

Similar News