కేసీఆర్ ఇలాకా నుంచి పోటీ చేయ‌నున్న రాహుల్‌

Update: 2017-06-28 07:54 GMT
కాంగ్రెస్ భ‌విష్య‌త్ నేత‌గా గుర్తింపు ద‌క్కించుకున్న ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆశ‌లు పెట్టుకుంది. ఇటీవ‌ల సంగారెడ్డిలో నిర్వ‌హించిన స‌భ విజ‌య‌వంతం అయిన నేప‌థ్యంలో రాహుల్ మంత్రాంగంతో ముందుకు సాగేందుకు కాంగ్రెస్ అడుగులేస్తోంది. ఈ క్ర‌మంలో మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రాష్ట్ర నేతలు ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారని స‌మాచారం. దీనికోసం సెంట్‌ మెంట్ అస్త్రంతో రాహుల్‌ పై ఒత్తిడి తెస్తున్న‌ట్లు చెప్తున్నారు. నాయనమ్మ ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి దేశానికి ప్రధాన మంత్రి అయ్యారని, అదే సెంటిమెంట్‌ 2019 ఎన్నికల్లో కలిసి వస్తుందని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై పార్టీ నేతలు అభిప్రాయ సేకరణ చేపట్టారు.

కాంగ్రెస్‌ పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాహుల్ గాంధీని మెద‌క్ నుంచి బ‌రిలోకి దింపేందుకు కాంగ్రెస్ నేత‌ల ఆలోచ‌న ఇలా ఉంది. 1980 సాధారణ ఎన్నికల్లో మెదక్‌ పార్లమెంటు నుంచి ఇందిరాగాంధీ పోటీ చేయ‌గా ఆమెకు 3,01,577 ఓట్లు ద‌క్కాయి. ఆమెపై పోటీ చేసిన ప్ర‌స్తుత కాంగ్రెస్ నేత‌ - కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ జైపాల్‌రెడ్డికి 2,19,124 ఓట్లు ద‌క్కాయి. సుమారు 80 వేల పైచిలుకు భారీ మెజార్టీతో ఇందిరాగాంధీ గెలిచారు. అనంత‌రం  ఆమె ప్రధానమంత్రి అయ్యారు. ఇందిరాగాంధీ పోటీ చేసిన స్థానం నుంచి పోటీ చేసి గెలవాలనే ఆలోచనతో రాహల్‌గాంధీ ఉన్నట్టు తెలిసింది. ఈ సెంటిమెంట్‌ కు తోడుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ నేతలు సమన్వయంతో వ్యవహరించి కష్టపడి పని చేస్తే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందన్న భరోసా వారిలో ఉంది. ఈ నేప‌థ్యంలో రాహుల్‌గాంధీని రంగంలోకి దింప‌డ‌మే క‌రెక్ట్ అని అంటున్నారు. ఆయన పోటీ చేస్తున్నారగానే పార్టీ నాయకులంతా కష్టపడి పని చేస్తారని అంటున్నారు.

మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గం తాజా రాజకీయ ముఖచిత్రం కూడా పార్టీకి అనుకూలంగా ఉందని చెప్తున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోకి ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సిద్దిపేట మినహా సంగారెడ్డి - పటాన్‌ చెరువు - నర్సాపూర్‌ - దుబ్బాక - గజ్వేల్‌ నియోజకవర్గాలు కాంగ్రెస్‌ పార్టీకి బలంగా ఉన్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌ ప్రభావంతో టీఆర్‌ఎస్‌ అన్ని సీట్లలో గెలిచింది. పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి వ‌స్తే 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కేసీఆర్‌ కు 657492 ఓట్లు రాగా - కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ పి శ్రవణ్‌ కుమార్‌ రెడ్డికి 260463 ఓట్లు వచ్చాయి. నాలుగు లక్షల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. ఆ తర్వాత కేసీఆర్‌ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరిగాయి. వెంటనే జరిగిన ఆ ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డికి లక్ష ఓట్లకుపైగా తగ్గాయి. అంటే మెద‌క్‌లోనూ టీఆర్ఎస్‌కు ఆద‌ర‌ణ త‌గ్గుతోంద‌ని కాంగ్రెస్ విశ్లేషిస్తోంది. మ‌రోవైపు ఇటీవ‌ల నిర్వహించిన తెలంగాణ ప్రజాగర్జన సభ తర్వాత పార్టీ బలం మ‌రోమారు స్ప‌ష్ట‌మైంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో యువ‌రాజు మెద‌క్ నుంచి పోటీ చేయ‌డ‌మే స‌రైన‌ద‌ని చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News