లక్ష ఓట్లు.. వెయ్యి కోట్లు.. ఇదీ రాజగోపాలరెడ్డి టార్గెట్..!

Update: 2022-10-16 00:30 GMT
మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఉప ఎన్నికపై భారీ ఆశలు పెట్టుకొన్నారా..? ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నారా..? అందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదా..? అందివచ్చిన అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారా..? ఈ ఎన్నిక బీజేపీకి కంటే తనకే ప్రతిష్టాత్మకంగా మారిందా..? అంటే పరిశీలకులు అవుననే సమాధానాలు వినిపిస్తున్నారు.

2014 ఎన్నికల్లో మునుగోడు నుంచి గెలిచినప్పటి నుంచీ రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. పార్టీ అధిష్ఠానం తమ కుటుంబానికి సరైన ప్రయారిటీ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ వచ్చారు. అప్పటి ఎన్నికల్లో తమ పార్టీ 19 సీట్లు గెలిస్తే తనకు సీఎల్పీ పోస్టు వస్తుందని భావించారు. ఆ పదవి కోసం తీవ్రంగానే శ్రమించారు. అయితే అధిష్ఠానం దళితుడైన భట్టి విక్రమార్క వైపే మొగ్గు చూపింది. రాజగోపాలరెడ్డికి సీఎల్పీ రాకపోవడానికి ఒక విధంగా మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా ఒక కారణమని ఆరోపణలు వచ్చాయి.

ఇవన్నీ మనసులో పెట్టుకొన్న ఆయన అప్పటి నుంచీ పార్టీ పెద్దలను విమర్శిస్తూ వచ్చారు. పార్టీ వ్యవహారాల ఇన్చార్జి కుంతియాను బహిరంగంగానే దూషించారు. ఆ తర్వాత తనకు లేదా తన సోదరుడు వెంకటరెడ్డి ఇద్దరిలో ఎవరికైనా పీసీసీ చీఫ్ ఇవ్వాలని కోరారు. అయినా అధిష్ఠానం పట్టించుకోలేదు. టీడీపీ నుంచి వచ్చిన యువకుడైన రేవంత్ రెడ్డికి పగ్గాలు అందించింది. పార్టీలోని మెజారిటీ యూత్ లీడర్లు కూడా రేవంతునే కోరుకున్నారు.

దీంతో ఖిన్నులైన కోమటిరెడ్డి సోదరులు అప్పటి నుంచి తమ నిరసన గళం వినిపిస్తున్నారు. వీరి అసమ్మతిని గమనించిన బీజేపీ పెద్దలు రాజగోపాలరెడ్డిని దువ్వడం మొదలుపెట్టారు. వారి వ్యూహంలో చిక్కుకున్న ఆయన ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలిసి వచ్చి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది.

అయితే.. రాజగోపాలరెడ్డి కేంద్రం వద్ద 22 వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకున్నారని.. అందులో వెయ్యి కోట్లు నియోజకవర్గంలో పంచి పెడుతున్నారని ఇతర పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనకు గత ఎన్నికల్లో వచ్చిన 99 వేల ఓట్ల కంటే అదనంగా తెచ్చుకోవాలని చూస్తున్నారని.. లక్ష ఓట్ల టార్గెట్ గా పని చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఒక్కో ఓటరుకు లక్ష రూపాయల చొప్పున లక్ష ఓట్ల టార్గెట్ గా వెయ్యి కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే నియోజకవర్గంలో 200 కార్లు పంపిణీ చేశారని.. యువతకు మరో 2 వేల మోటారు సైకిళ్లు కొనిచ్చారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇది ఇంతటితో ఆగేది కాదని.. ఎన్నికలకు మరో రెండు వారాల సమయం ఉన్నందున ఈ ఖర్చు ఇంకా పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. చూడాలి మరి రాజగోపాలరెడ్డి ఆశయాలు ఏమేరకు నెరవేరుతాయో..  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Tags:    

Similar News