షా మీటింగ్ తో రామోజీ టోన్ మారుతుందా?

Update: 2018-07-16 08:42 GMT
మీడియా మొఘ‌ల్ రామోజీరావుతో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా భేటీ అటు మీడియా వ‌ర్గాల్లోనూ.. ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. తెలుగు ప్ర‌జ‌ల్ని త‌న వార్త‌లతో.. వ్యాఖ్యానాల‌తో ప్ర‌భావితం చేయ‌టంలో తిరుగులేని నేర్పు ఉన్న‌ట్లుగా చెప్పే రామోజీతో అమిత్ షా భేటీ ఎందుక‌న్న దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

నాలుగేళ్ల మోడీ పాల‌న‌ను వివ‌రించేందుకు రామోజీతో అమిత్ షా భేటీ అంటూ చిన్న‌పిల్లాడు సైతం న‌మ్మ‌లేని మాట‌ను నిజంగా చెబుతున్న బీజేపీ నేత‌ల మాట‌ల్ని ప‌క్క‌న పెడితే.. రానున్న ఎన్నిక‌ల సంద‌ర్భంగా బీజేపీకి రామోజీ త‌ర‌ఫు హామీ కోస‌మే షా భేటీ అయ్యార‌ని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల సంగ‌తి ఎలా ఉన్నా.. ఈనాడుకు చెందిన ఈటీవీ వివిధ రాష్ట్రాల్లో చూపించే ప్ర‌భావం వేరు. అంతేకాదు.. రామోజీకి చెందిన ఇత‌ర మీడియా సంస్థ‌ల్లోనూ బీజేపీ వ్య‌తిరేక టోన్ వినిపించే విష‌యంలో కాస్తంత సంయ‌మ‌నం వ‌హించాల‌ని కోరిన‌ట్లుగా తెలుస్తోంది.

రామోజీతో షా భేటీ నేప‌థ్యంలో ఈనాడు టోన్ లో ఎంతోకొంత మార్పు వ‌స్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. రామోజీకి.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు మ‌ధ్య‌నున్న అనుబంధం ఎలాంటిదో ప్ర‌తి తెలుగు పాఠ‌కుడికి తెలిసిందే. మ‌రి.. అలాంటివేళ‌.. బీజేపీతో రామోజీ జ‌త క‌డ‌తారా? అన్న‌ది ప్ర‌శ్న‌. అయితే.. బీజేపీని ఆకాశానికి ఎత్త‌క‌పోయినా.. నిప్పులు చెర‌గ‌కుండా ఉంటే చాల‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

మోడీ స‌ర్కారు పాల‌న‌లోని అంశాలను విశ్లేషించే క్ర‌మంలో ఈనాడు టోన్ నెగిటివ్ గా లేకుండా చూడాల‌న్న‌దే షా తాప‌త్ర‌యంగా చెబుతున్నారు. ఈ విష‌యంపై రామోజీ నుంచి అభ‌య‌హ‌స్తం ల‌భించింద‌ని.. నెగిటివ్ స్థానే న్యూట్ర‌ల్ గా వ్య‌వ‌హ‌రించే వీలుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ భేటీ సారాంశం బ‌య‌ట‌కు రాకున్నా.. ఇప్పుడు వెలువ‌డుతున్న అభిప్రాయాలు ఎంత‌మేర నిజ‌మ‌న్న విష‌యం రానున్న రోజుల్లో ఈనాడు టోన్ చూస్తే ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చ‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.
Tags:    

Similar News