అమ‌రావ‌తి ఒక ఊబి - అందుకే జ‌గ‌న్ మార్చారా?!

Update: 2020-03-02 15:46 GMT
ఏపీ రాజ‌ధాని అంటూ చంద్ర‌బాబు నాయుడు గ‌త ఐదేళ్ల పాటు అమ‌రావ‌తి పేరుతో ర‌క‌ర‌కాల హంగామా సృష్టించారు. పైకి గ్రాఫిక్స్ చూపుతూ - మ‌రోవైపు విదేశాలు చుట్టేస్తూ.. అక్క‌డ ఫొటోలు దిగి వాట‌న్నింటినీ అమ‌రావ‌తికి తీసుకురాబోతున్న‌ట్టుగా చంద్ర‌బాబు నాయుడు హ‌ల్చ‌ల్ చేశారు. ఐదేళ్లూ అలా గ‌డిచిపోయాయి. అమ‌రావ‌తి అడుగు ముందుకు ప‌డ‌లేదు! ప్ర‌జ‌లు కూడా అమ‌రావ‌తి విష‌యంలో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌గ‌ల్బాల‌ను ఏ మాత్రం న‌మ్మ లేదని ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో స్ప‌ష్టం అయ్యింది.

జ‌గ‌న్ వ‌స్తే అమ‌రావ‌తి ఉండ‌ద‌ని తెలుగుదేశం పార్టీ ముందు నుంచినే ప్ర‌చారం చేసింది. చివ‌ర‌కు ఆ ప్ర‌చారం మాత్రం నిజం అయ్యే దిశ‌గా సాగుతున్నాయి ప‌రిణామాలు. అమ‌రావ‌తిని ఒక రాజ‌ధానిగా కొన‌సాగిస్తున్నా..అంత‌కు ముందు చెప్పిన గ్రాఫిక్స్ ఊసుల‌ను మాత్రం లేకుండా చేశారు వైఎస్ జ‌గ‌న్. ఆ పై క‌ర్నూలు - విశాఖ‌ల‌కు రాజ‌ధాని హోదాల‌తో పూర్తి ప్రాక్టిక‌ల్ గా వికేంద్రీక‌ర‌ణ దిశ‌గా జ‌గ‌న్ పాల‌న సాగుతూ ఉంది. ఇంత‌కీ మొద‌ట్లో అమ‌రావ‌తి విష‌యంలో అంత వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేయ‌ని జ‌గ‌న్ - తాము అధికారంలోకి వ‌స్తే  అమ‌రావ‌తికి ప్రాధాన్య‌త త‌గ్గుతుంద‌ని చెప్ప‌ని ఆయ‌న ఆ త‌ర్వాత మాత్రం వికేంద్రీక‌ర‌ణ‌కు ఎందుకు పెద్ద‌పీట వేశార‌నే అంశం గురించి ఆస‌క్తిదాయ‌క‌మైన విష‌యాలు తెలుస్తూ ఉన్నాయి.

వికేంద్రీక‌ర‌ణ‌కు వైఎస్ జ‌గ‌న్ పెద్ద పీట వేయ‌డం వెనుక ప్రాంతీయ విబేధాలు త‌లెత్త‌కూడ‌నీయ‌దు అనే అభిప్రాయ‌మే ఉంది. గ‌తంలో తెలంగాణ విడిపోవ‌డంతో సీమాంధ్ర‌కు జ‌రిగిన న‌ష్టం ఏమిటో చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి అదే ప‌రిస్థితి త‌లెత్త‌కుండా - ప్ర‌జ‌ల ప‌న్నుల‌న్నీ ఒకే చోట ప్ర‌భుత్వ పెట్టుబ‌డులుగా మారి, ఆ ప్రాంతంలో ఉన్న వారికే ల‌బ్ధి క‌లిగించ‌డం వ‌ల్ల వ‌చ్చే ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని జ‌గ‌న్ వికేంద్రీక‌ర‌ణ‌కు మొద‌టి ప్రాధాన్య‌తను ఇచ్చార‌ని స్ప‌ష్టం అవుతోంది. ఇది ఒక అంశం.

ఈ విష‌యంలో మ‌రో కీల‌క‌మైన అంశం కూడా ఉంది. అదే.. అమ‌రావ‌తి ఒక పెద్ద స్కామ్ అని జ‌గ‌న్ కు పూర్తి స్ప‌ష్ట‌త రావ‌డం! అమ‌రావ‌తి విష‌యంలో గ‌త ఐదేళ్ల‌లో ఏం జ‌రిగిందంటే.. అదో పెద్ద కుంభ‌కోణం అని ప్ర‌భుత్వంలోకి వ‌చ్చాకా వైఎస్ జ‌గ‌న్ కు పూర్తి స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్టుగా స‌మాచారం. అమ‌రావ‌తిలో గ‌త ఐదేళ్లలో జ‌రిగిన స్వ‌ల్ప‌మైన నిర్మాణాల‌కు కూడా భారీ అంచ‌నాల‌ను పెట్టారు. హ‌ద్దు లేని రీతిలో బిల్లులు పెట్టారు. చేయ‌ని ప‌నుల‌కు బిల్లులు - చేసిన ప‌నుల‌కు మ‌రింత హై రేంజ్ బిల్లులు.. వాట‌న్నింటినీ ప్ర‌భుత్వం చెల్లించాలి! ఈ విష‌యంలో జ‌గ‌న్ మీద ఒత్తిడి తీసుకురాసాగారు గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోని కాంట్రాక్ట‌ర్లు. ఒక ద‌శ‌లో చంద్ర‌బాబు నాయుడు కూడా త‌మ వాళ్ల బిల్లులు ఆపుతున్నారంటూ వ్యాఖ్యానించారు. బోగ‌స్ ప‌నులు - బోగ‌స్ బిల్లులు.. ఇవ‌న్నీ ఇలాగే కొన‌సాగితే ప్ర‌భుత్వం దివాళా తీయ‌డం త‌ప్ప మ‌రోటి ఉండ‌దు. ఒక‌వైపు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు భారం ఉండ‌నే ఉంది, ఆ పై అమ‌రావ‌తి ఒక ఊబిలా మారే అవ‌కాశాలు స్ప‌ష్టం అయ్యాయి వైఎస్ జ‌గ‌న్ కు. తెలుగుదేశం వాళ్లు ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ తో భూములు అక్క‌డ భారీ ఎత్తున కొనుగోళ్లు చేసిన అంశం ఒక‌టైతే.. ఈ బిల్లులు ముందు ముందు మ‌రింత భారంగా మారే అవ‌కాశాలు స్ప‌ష్టంగా గోచ‌రించిన‌ట్టుగా తెలుస్తోంది.

మ‌రోవైపు ఏపీకి విశాఖ రూపంలో ఒక వ‌ర‌ప్ర‌దం ఉండ‌నే ఉంది. ఆ సాగ‌ర తీర న‌గ‌రం అభివృద్ధి అయ్యి రెడీగా ఉన్న‌ట్టే. ఐటీకి అయినా మ‌రో ర‌క‌మైన పెట్టుబ‌డుల‌కు అయినా విశాఖ రెడీగా ఉన్న న‌గ‌ర‌మే. ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తి ఊబిలో కూరుకుపోవ‌డం క‌న్నా.. వ‌న‌రుల‌తో కూడిన విశాఖ‌ను ఉప‌యోగించుకోవ‌డం మంచిద‌నే భావ‌న‌కు సీఎం జ‌గ‌న్ వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తోంది.

అటు ప్రాంతీయ విబేధాలు త‌లెత్త‌కుండా చెక్ పెట్ట‌గ‌లిగే అవ‌కాశం, ఇంకో వైపు విశాఖ రూపంలో చేతిలో ఉన్న ఒక పెద్ద న‌గ‌రాన్ని ఐటీ తో పాటు ఇత‌ర రంగాల్లోనూ అభివృద్ధి చేసుకోవ‌డానికి ఉన్న అవ‌కాశం.. ఈ నేప‌థ్యంలోనే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమరావ‌తిని కాస్త ప‌క్క‌న పెట్టి, మూడు రాజ‌ధానుల ఫార్ములాను అనుస‌రిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.


Tags:    

Similar News