కొడుకును సీఎం చేయ‌టానికి కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్‌

Update: 2018-03-05 05:25 GMT
కేసీఆర్ ఏం చెప్పినా చెవుల‌కు ఎంత ఇంపుగా ఉంటుందో. ఆయ‌న మాట తీరే అలా ఉంటుంది. తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టినప్ప‌టికీ ఆయ‌న మాటన్నా.. ఆయ‌న స‌మ‌ర్థ‌త మీద ఏపీ ప్ర‌జ‌ల్లో కొంద‌రికున్న భ‌క్తి అంతా ఇంతా కాదు. ఆంధ్రోళ్లు అంటూ చెడామ‌డా తిట్టేసి.. ఆంధ్రోళ్లు చేసిన అన్యాయం అన్న మాట‌ను కేసీఆర్ ఎంత త‌ర‌చూ అంటారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

తాను అనే ఆంధ్రోళ్లు అనే మాట ఆంధ్రా నేత‌ల‌ను ఉద్దేశించిందే త‌ప్పించి ఆంధ్రా ప్రాంత ప్ర‌జ‌ల‌ను కాద‌నే అయింట్ మెంట్ మాట ఆయ‌న నోటి నుంచి అప్పుడ‌ప్పుడు వ‌స్తుంటుంది. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌ని చంద్ర‌బాబుకు షాక్ ఇచ్చేస్తేందుకు.. ఆయ‌న కంట్లో న‌ల‌క‌లా మారేందుకు తెలంగాణ నినాదాన్ని తెర మీద‌కు తీసుకురావ‌ట‌మే కాదు..  తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్ర మొద‌టి సీఎంగా కుర్చీలో కూర్చేసిన వ్యూహ‌చ‌తుర‌త కేసీఆర్ సొంతం.

ప్ర‌జ‌లు కోరుకునే దాని కోసం పోరాడ‌టం నాయ‌కులుగా ఉన్న వారు చేసేది. కానీ.. ప్ర‌జ‌లేం కోరుకోవాలో డిసైడ్ చేసి మ‌రీ.. కోట్లాడేలా చేసే టాలెంట్ కేసీఆర్ సొంతం. తెలంగాణ సాధ‌న కోసం గొంతెత్తిన కేసీఆర్‌.. త‌ర్వాతి కాలంలో తెలంగాణ సాధ‌న త‌ప్పించి మ‌రేమీ గుర్తు లేకుండా చేశారు.

మ‌రి.. తెలంగాణ రాష్ట్రం వ‌చ్చింది. నాలుగేళ్లు పూర్తి అయ్యింది కూడా. మ‌రి.. తెలంగాణలోని స‌గ‌టుజీవి బతుకు ముఖ‌చిత్రం మారిందా?  ప్ర‌భుత్వం మీద త‌న‌కున్న ఆగ్ర‌హాన్ని నోరారా త‌ప్పు ప‌ట్టే అవ‌కాశం అయినా ఉందా? అంటే.. వాస్త‌వం తెలంగాణ‌లో ఉద్య‌మ‌నేత‌ల‌కు బాగా తెలుసు. తెలంగాణ సాధ‌న స‌మ‌యంలో ఉద్యమం చేసిన చాలామంది నేత‌ల‌కు.. అప్ప‌టికి ఇప్ప‌టికి పరిస్థితుల్లో తేడా ఎంత‌న్న‌ది వారిప్పుడు బాహాటంగానే చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. కొడుకును సీఎం చేయ‌టానికి కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్ వేశారా? అంటే అవున‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌న త‌ర్వాత త‌న కొడుక్కి ప‌ట్టాభిషేకం చేయాలంటే ఎదుర్కొనే విమ‌ర్శ‌లు.. పార్టీలో చోటు చేసుకునే ప‌రిణామాలు చాలానే ఉంటాయి. మ‌రి.. వాటన్నింటికి చెక్ చెప్పేసి.. తానేం అనుకుంటున్నానో అది మాత్ర‌మే జ‌రిగేలా చేయ‌టం కోసం భారీ ప్లాన్ ను సిద్ధం చేసిన‌ట్లుగా తాజా మాట‌ల్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది.

తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఎలాంటి బ‌ల‌మైన సెంటిమెంట్ ను ర‌గులుస్తుందో.. దేశానికి కొత్త దిశ క‌ల్పించాల‌న్న వాద‌న అటు పార్టీలోనూ.. ఇటు ప్ర‌జ‌ల్లోనూ కొత్త భావోద్వేగాన్ని ర‌గిలిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తెలంగాణ సాధ‌న స‌మ‌యంలో తెలంగాణ ఏర్ప‌డిన వెంట‌నే మొద‌టి ముఖ్య‌మంత్రిగా ఒక ద‌ళితుడ్ని ఏర్పాటు చేస్తాన‌ని.. త‌న‌కు ప‌ద‌వి మీద ఆశ లేద‌న్న మాట చెప్పిన కేసీఆర్‌.. తీరా తెలంగాణ సాధించిన త‌ర్వాత ఇంత క‌ష్ట‌ప‌డి సాధించిన తెలంగాణ‌ను ఎవ‌రో చేతిలో  పెట్టుడు కాదు క‌దా.

ఏపీ వాళ్లు ఎక్కెసం చేయ‌కుండా ఉండేలా స‌మ‌ర్థంగా పాలించ‌టం.. తెలంగాణ‌కు స‌రికొత్త దిశానిర్దేశం చేయ‌టం అవ‌స‌ర‌మ‌ని చెబుతూ.. తాను సీఎం కావాల్సిన అవ‌స‌రాన్ని సృష్టించ‌టంతో పాటు.. తాను సీఎం కావ‌టం ఎంత మాత్రం త‌ప్పుకాద‌న్న భావ‌న‌ను క‌లిగించేలా చేయ‌టంలో కేసీఆర్ స‌క్సెస్ అయ్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తాజాగా కేంద్రం మీద యుద్ధాన్ని ప్ర‌క‌టించిన కేసీఆర్ మాట‌ల్ని చూస్తే.. మోడీకి త‌గిన శాస్తి చేసేందుకు కేసీఆర్ రంగంలోకి దిగార‌న్న ఉత్సాహ‌మే త‌ప్పించి.. త‌న త‌ర్వాత త‌న సీట్లో కూర్చోబెట్టటానికి అవ‌స‌ర‌మైన రంగాన్ని ప‌క్కాగా సిద్ధం చేశార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. కేంద్రంపై ఫైట్ అన్న వేళ‌.. తాను చూడాల్సిన అంశాలు చాలానే ఉంటాయ‌న్న భావ‌న క‌లిగించ‌టం ద్వారా.. త‌న కొడుకును సీఎం సీట్లో కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

మామూలుగా అయితే.. ముఖ్య‌మంత్రి సీట్లో కేటీఆర్ ను కూర్చోబెడితే.. హ‌రీశ్ రావు వ‌ర్గం ఉత్తినే ఉండ‌దు. కానీ.. ఇప్పుడున్న ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ఆ మాట‌ను ఓపెన్ గా చెప్ప‌లేరు. కేటీఆర్ దీక్షా.. ద‌క్ష‌త‌ను ఇప్ప‌టికే ప్రూవ్ చేశారు కాబ‌ట్టి.. ఆయ‌న్ను సీఎంగా ప్ర‌క‌టించేలా చేస్తే ఎవ‌రికి ఎలాంటి అభ్యంత‌రం ఉండ‌దు. అభ్యంత‌రం చెప్పాల‌నుకునే వారు సైతం.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప‌ద‌వుల కోసం అడిగితే బాగోద‌న్న భావ‌న ఉంటుంది. పెద్దగీత సైతం చిన్న‌బోయేలా చేయాలంటే దాని పైన మ‌రింత పెద్ద గీత గీయ‌టమే మంచిద‌న్న విష‌యం కేసీఆర్ లాంటి వారికి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అందుకే మ‌రి.. కేసీఆర్ ను మాస్ట‌ర్ మైండ్ అని.  


Tags:    

Similar News