కేసీఆర్ కు 106 సీట్లు ప‌క్కా.. ఎలానంటే?

Update: 2018-03-07 03:49 GMT
భావోద్వేగ రాజ‌కీయాలు ఎలా చేయాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు అస్స‌లు చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆయ‌న‌కు ఆ విష‌యంలో నూటికి నూరు మార్కులు వేయొచ్చు. అవ‌కాశం ఉంటే మ‌రో ప‌ది.. ఇర‌వై మార్కులు ఎక్కువ వేసినా ఇబ్బంది లేదు. భావోద్వేగాల్ని ర‌గిలించే విష‌యంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి.

త‌మ ప్ర‌భుత్వానికి తిరుగులేద‌ని.. ప్ర‌జ‌ల్లో విప‌రీత‌మైన బ‌లం ఉంద‌ని..ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా త‌మ‌కు వంద సీట్లు గ్యారెంటీ అన్న కేసీఆర్ ఈ మ‌ధ్య‌న 106 సీట్లు ప‌క్కా అని నొక్కి వ‌క్కాణిస్తున్నారు. కేసీఆర్ కు అంత ధీమా ఎలా అన్న‌ది కొంద‌రికి సందేహం గా ఉంది. అయితే.. కేసీఆర్ స్కెచ్ చూస్తే.. 106 సీట్ల సాధ‌న ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కేసీఆర్ కు ఏ మాత్రం క‌ష్టం కాద‌న్న మాట బ‌లంగా వినిపిస్తుంది. అదెలా అన్న విష‌యాన్ని చూసిన‌ప్పుడు ఆస‌క్తిక‌ర అంశాలు క‌నిపిస్తాయి.

కేసీఆర్ గేమ్ ప్లాన్  మ‌రింత బాగా అర్థం కావాలంటే లైవ్ ఎగ్జాంఫుల్ ఒక‌టి చెబితే స‌రిపోతుంది. ఈ మ‌ధ్య‌న గుజ‌రాత్ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. రెండు ద‌శాబ్దాల‌కు పైగా బీజేపీ పాల‌న‌లో ఉన్న గుజ‌రాతీయులు అక్క‌డి అధికార‌ప‌క్షంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈసారి మోడీకి షాక్ ఇవ్వాల‌ని ఎక్కువ‌మంది అనుకున్నారు కూడా. ఈ విష‌యాన్ని నిఘా వ‌ర్గాల ద్వారా తెలుసుకున్న మోడీ.. ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి దిగిన వెంట‌నే భావోద్వేగ రాజ‌కీయాల‌కు తెర తీశారు.

గుజ‌రాతీ అన్న ఫీలింగ్‌ ను తెచ్చేశారు. ప్ర‌ధాని కుర్చీలో కూర్చున్న వ్య‌క్తి.. ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌చ్చేస‌రికి ఒక ప్రాంతీయ పార్టీ నేత‌గా మాట్లాడ‌టం అప్ప‌ట్లో ప‌లువురు త‌ప్పు ప‌ట్టినా.. బీజేపీ ప‌రివారం అవేమీ ప‌ట్టించుకోలేదు. త‌మ‌దైన ప్ర‌చారంలోనే ముందుకెళ్లారు. ప్ర‌ధాని కుర్చీలో ఒక గుజ‌రాతీ కూర్చున్న వేళ‌.. సొంత రాష్ట్రంలో ఓడిపోతే దేశంలో గుజ‌రాత్ ప‌రువేం కావాల‌న్న భావ‌న‌ను తీసుకురావ‌టంలో స‌క్సెస్ అయ్యారు.

అంతే.. అంత వ్య‌తిరేక‌త‌లోనూ స్వ‌ల్ప మెజార్టీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం బీజేపీకి ద‌క్కింది. మ‌రో ఐదేళ్ల పాటు గుజ‌రాత్ లో తిరుగులేద‌ని తేల్చేయ‌టంతో పాటు.. సొంత రాష్ట్రంలో మోడీకున్న ప‌ట్టు ఎంత‌న్న‌ది దేశానికి తెలిసింది. ఇంచుమించు ఇదే త‌ర‌హా వ్యూహ‌మే కేసీఆర్ అనుస‌రించ‌నున్నార‌ని చెప్పాలి.

ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌స్తావించిన స‌ర్వే ఫ‌లితాలు.. వంద‌కు త‌గ్గ‌కుండా సీట్లు ప‌క్కా అన్న‌వి మాట్లాడుకోవ‌టానికి బాగానే ఉంటాయి కానీ.. వాస్త‌వం వేరుగా ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అలా అని.. టీఆర్ ఎస్ పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌ద‌ని చెప్ప‌టం లేదు. కేసీఆర్ చెప్పిన‌ట్లుగా వంద సీట్లు రాకున్నా.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన బ‌లంతో పాటు.. అద‌నంగా మ‌రికొన్ని సీట్లు ఖాయం. ఆ మాట‌కు తిరుగులేదు. కాకుంటే కేసీఆర్ చెప్పినంత భారీ మెజార్టీ రాదు.

కానీ.. జాతీయ రాజ‌కీయాల మీద దృష్టి సారించ‌టం.. మూడో ఫ్రంట్ ఆలోచ‌న‌లు చేస్తున్న వేళ‌.. కేసీఆర్ మీద ఉన్న వ్య‌తిరేక‌త కాస్తా సానుకూల‌తగా మారిపోతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ద‌క్షిణాదికి చెందిన నేత‌లు అప్పుడెప్పుడో జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పార‌న్న మాట‌ను చెబుతారు. తొలిత‌రం కాంగ్రెస్ నేత‌లు త‌ర్వాత‌.. జాతీయ రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేసిన నేత ఎవ‌రైనా ఉన్నారా? అంటే.. అది ఎన్టీఆర్ మాత్ర‌మే. ఆయ‌న త‌ర్వాత జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పింది అంతంతే. చంద్ర‌బాబు పేరు చెప్పినా.. అది వాజ్ పేయ్.. అద్వానీల మంచిత‌నంగా మాత్ర‌మే చెప్పాలి.

ఇన్నాళ్ల త‌ర్వాత కేసీఆర్ రూపంలో ద‌క్షిణాది వాయిస్ వినిపించేలా చేయ‌టం.. మోడీ లాంటి మొన‌గాడికి ఎదురుగా నిలిచే ధైర్యం చేయ‌టం తెలంగాణ‌లో టీఆర్ ఎస్ కు సానుకూల‌త‌గా మారుతుంద‌న‌టంలో ఎలాంటి సందేహం లేదు. భావోద్వేగాల్ని రగ‌ల్చ‌టంలో దిట్ట అయిన కేసీఆర్ కు.. తెలంగాణ స‌త్తాను ఓటు రూపంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చాటాల‌ని.. దేశానికి తెలంగాణ దిశానిర్దేశం కావాలంటూ ఆయ‌న చేసే ఆవేశ‌పూరిత ప్ర‌సంగాలు ఓట్ల వ‌ర్షంగా మార‌తాయ‌న‌టంలో సందేహం లేదు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ చెప్పిన‌ట్లుగా 106 సీట్ల‌లో గులాబీ జెండా ఎగిరినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News