జైట్లీని కేటీఆర్‌ కలిసింది ఇందుకేనా?

Update: 2015-06-28 03:43 GMT
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌.. తాజాగా కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీని కలవటం తెలిసిందే. ఇంతకీ ఆయనెందుకు కలిసారన్న విషయాన్ని ఆరా తీస్తే ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చాయి.

విభజన సందర్భంగా ఏపీ బెవరేజస్‌కు ఉన్న అప్పును.. ఆంధ్రా.. తెలంగాణకు పంచలం.. దీనిపై ఐటీ శాఖ నోటీసులు ఇవ్వటం.. వ్యవహారం కోర్టుల వరకు వెళ్లటం తెలిసిందే. కోర్టు సైతం తెలంగాణ ప్రభుత్వం ఆ మొత్తం ఐటీ శాఖకు చెల్లించాలని చెప్పినప్పటికీ.. తెలంగాణ సర్కారునుంచి స్పందన లేకపోవటంతో.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మొత్తంలో నుంచి.. తమకు రావాల్సిన మొత్తాన్ని ఐటీ శాఖ ఆర్‌బీఐ నుంచి నిధులు బదిలీ చేసుకుంది.

ఐటీ శాఖ ఇచ్చిన ఈ షాక్‌ను ఏ మాత్రం ఊహించని తెలంగాణ సర్కారు.. నష్టనివారణ చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్‌.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విభజన తర్వాత తెలంగాణ బెవరేజస్‌ ఏర్పడిందని.. ఏపీ బెవరేజస్‌ అప్పులతో తమకు సంబంధం లేదని వివరించటమే కాదు.. తమ ఖాతా నుంచి తీసుకున్న మొత్తానికి తిరిగి ఇప్పించాల్సిందిగా కోరారు.

ఆస్తుల విషయంలో పట్టుబట్టి మరీ తన వాటాను లాగేసుకునే తెలంగాణ రాష్ట్రం.. అప్పుల విషయంలో మాత్రం తమకు సంబంధం లేదని లెక్కలు చెప్పటం గమనార్హం. కొసమెరుపు ఏమిటంటే.. ఇలాంటి ఉదంతంలోనే ఏపీ కూడా ఐటీ శాఖకు బకాయిలు ఉన్నప్పటికీ.. ఏపీ నిధులు తీసుకోకుండా.. తెలంగాణ సర్కారు నిధుల్ని మాత్రం తీసుకోవటం ఏమిటంటూ ప్రశ్నించినట్లు చెబుతున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరి పంచాయితీ వాళ్లది. పక్కనోడితో పోలిక పెట్టి.. ఇష్యూలోకి తమను ఎందుకు లాగుతారంటూ ఏపీ అధికారపక్ష నేతలు గుర్రుగా ఉన్నారు.

Tags:    

Similar News