నరసింహన్ ముందు వెళ్లిపోవాల్సి వచ్చిందా?

Update: 2019-09-10 05:16 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ కు మధ్యనున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో మరే ముఖ్యమంత్రికి.. గవర్నర్ కు లేనంత సన్నిహిత సంబంధాలు వారిద్దరి సొంతం. ఉమ్మడి రాష్ట్రంలో యూపీఏ సర్కారు నియమించిన నరసింహన్.. మోడీ హయాంలోనూ కంటిన్యూ కావటం.. ఆయన టర్మ్ ను పొడిగించుకునేలా చేసుకోవటం సక్సెస్ అయ్యారు.

చాలా తక్కువమంది గవర్నర్లకు సాధ్యమయ్యే రెండో టర్మ్ పొడిగింపును చాలా సులువుగా చేసుకోవటం ద్వారా తానెంత పవర్ ఫుల్ అన్న విషయాన్ని నరసింహన్ చెప్పకనే చెప్పేశారు. అంతటి పెద్దమనిషి.. తెలంగాణ గవర్నర్  పదవి నుంచి తప్పుకునే వేళలో మాత్రం ఆయన కోరుకున్న కొన్ని విషయాలు జరగలేదన్న నిజం తాజాగా బయటకు వచ్చింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నరసింహన్ గవర్నర్ హోదాలో ఈ నెల 11 వరకు ఉండాలని భావించారట. ఆ రోజు మంచి రోజు కావటంతో.. అప్పటివరకూ ఉండాలనుకున్నారట. దీనికి సంబంధించిన మౌఖిక అనుమతి కూడా తీసుకున్నట్లు సమాచారం. అయితే.. తెర వెనుక చోటుచేసుకున్న ఒక ఉదంతం ఆయన త్వరగా వెళ్లిపోయేలా చేసిందని చెబుతున్నారు.

ఆగస్టు 31న కొత్త గవర్నర్ వస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ కు సమాచారం అందింది. అయితే.. అప్పటికే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావించిన కేసీఆర్.. గవర్నర్ వెళ్లే లోపు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని భావించారు. ఇందుకు సంబంధించి డేట్ ఫిక్స్ చేయాలని పండితుల్ని కోరగా.. వారు ఎనిమిదో తేదీ దివ్యంగా ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో.. ఎనిమిదో తేదీన మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించి.. పదో తేదీన ప్రగతి భవన్ లో ఘనంగా విందు ఇచ్చి వీడ్కోలు పలకాలని భావించారు.

అయితే.. ఒక గవర్నర్ తాను పదవి నుంచి దిగిపోయే సమయం ఆసన్నమైనప్పుడు.. మంత్రుల చేత ప్రమాణస్వీకారం లాంటివి చేయించరు. ఇదేమీ నిబంధన కాకున్నా.. పదవి నుంచి వీడే వేళలో.. కీలకమైన పనులు చేయకుండా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే.. కేసీఆర్ మాత్రం మీ చేతలు మీదుగా మంత్రివర్గ విస్తరణ జరగాలన్న ఆకాంక్షను నరసింహన్ ముందు పెట్టటం.. ఆ విషయం కేంద్రంలోని ముఖ్యనేతలకు తెలీటంతో వారు ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. కొత్త గవర్నర్ వస్తుంటే.. వారితో కాకుండా వెళ్లిపోతున్న గవర్నర్ తో కేబినెట్ విస్తరణ కార్యక్రమం చేపట్టటం ఏమిటన్న ప్రశ్నను వేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాల్సిన తమిళిసైకు కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లుగా సమాచారం. మరే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్లి.. పదవీ బాధ్యతలు చేపట్టాలన్న మౌఖిక ఆదేశంతో ఆమె ఎనిమిదో తేదీన వచ్చి గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే.. ఆమె ప్రమాణస్వీకారాన్ని మూడు రోజుల ముందుకు వెళ్లేలా చేసిందంటున్నారు.

దీంతో.. ముందుగా వేసుకున్న ప్లాన్లు అన్ని వెనక్కి పోవటమే కాదు.. హడావుడిగా నరసింహన్ గవర్నర్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చిందంటున్నారు. ఒకవిధంగా చూస్తే.. కేసీఆర్ కానీ కేబినెట్ విస్తరణ కార్యక్రమాన్ని కానీ పెట్టుకోకుండా ఉండి ఉంటే.. హడావుడిగా.. ముందే వెళ్లిపోవాల్సిన అవసరం నరసింహన్ కు వచ్చేది కాదన్న మాట బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News