కూతురి కోస‌మే హేలీకి ఎసరుపెట్టాడా?

Update: 2018-10-10 08:53 GMT
ఐక్య‌రాజ్య స‌మితిలో అమెరికా రాయ‌బారిగా ఉన్న నిక్కీ హేలీ తాజాగా త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ముంద‌స్తు సంకేతాలేవీ ఇవ్వ‌కుండా ఒకేసారి ఆమె ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవ‌డంపై ప‌లు ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పొమ్మ‌న‌కుండా పొగ‌బెట్ట‌డంతోనే ఆమె రాజీనామా చేశార‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. అయితే, హేలీ రాజీనామా కార‌ణాల‌తోపాటు ప్ర‌స్తుతం మ‌రో అంశంపై కూడా ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రుగుతోంది. అదేంటంటే..

హేలీ స్థానంలో ఎవ‌రు బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నారు? అమెరికాతోపాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ ప్ర‌శ్న అంద‌ర్నీ ఆక‌ర్షిస్తోంది. అయితే, కీల‌క‌మైన ఈ ప‌ద‌విని ట్రంప్ త‌న కుమార్తె ఇవాంకా ట్రంప్‌ కు క‌ట్ట‌బెట్టే అవ‌కాశాలున్న‌ట్లు విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇవాంకా కోస‌మే హేలీకి ట్రంప్ ఎస‌రు పెట్టార‌ని కూడా ప‌లువురు ఆరోపిస్తున్నారు. ఇవాంకాను ఐక్య‌రాజ్య స‌మితిలో అమెరికా రాయ‌బారిగా నియ‌మించ‌డంపై ట్రంప్ తాజాగా విలేక‌ర్ల స‌మావేశంలో కొన్ని సంకేతాలిచ్చారు కూడా. హేలీ త‌ర్వాత అంత‌టి డైన‌మిక్ అంబాసిడ‌ర్ అయ్యే అర్హ‌త ఇవాంకాకే ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే, త‌న కుమార్తెనే ఎంపిక చేస్తే.. బందుప్రీతి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తే అవ‌కాశాలున్నాయ‌ని ట్రంప్ అనుమానం వ్య‌క్తం చేశారు.

ట్రంప్ మాట‌ల‌తో ఆయ‌న మ‌న‌సులోని అస‌లు ఉద్దేశం బ‌య‌ట‌ప‌డిన‌ట్లేన‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఎవ‌రేం అనుకున్నా ప‌ట్టించుకునే మ‌న‌స్త‌త్వం ఆయ‌న‌ది కాద‌ని గుర్తుచేస్తున్నారు. బందుప్రీతి ఆరోప‌ణ‌ల‌కు ట్రంప్ భ‌య‌ప‌డ‌ర‌ని.. హేలీ స్థానంలో ఇవాంకాను నియ‌మించ‌డం దాదాపు ఖాయ‌మేన‌ని చెబుతున్నారు. అయితే, ఇవాంకా మాత్రం ఈ విష‌యంపై కాస్త భిన్నంగా స్పందించారు. హేలీ స్థానంలో తాను కాకుండా వేరొక‌రు నియ‌మితుల‌వుతార‌ని విశ్వ‌సిస్తున్న‌ట్లు చెప్పారు. వైట్ హౌస్‌ లో, అమెరికా ప్ర‌భుత్వ యంత్రాంగంలో పాత వ్య‌క్తుల‌ను ఒక్కొక్క‌రిగా ప‌క్క‌కు త‌ప్పిస్తూ.. త‌న‌కు అనుకూలంగా ఉండేవారికి ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్న ట్రంప్‌.. అత్యంత కీల‌క‌మైన ఐరాస‌కు హేలీ స్థానంలో ఎవ‌రిని పంపిస్తారో వేచి చూడాల్సిందే మ‌రి!


Tags:    

Similar News