గుడివాడ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌.. మళ్లీ కలిసిన ఆ ఇద్దరు నేతలు!

Update: 2022-12-09 08:30 GMT
కృష్ణా జిల్లా రాజకీయాల్లో వంగవీటి రాధా, కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్‌లది విలక్షణ శైలి. వీరు ముగ్గురూ ప్రాణమిత్రులు. పార్టీలు వేరైనా ప్రాణమిత్రులుగానే ఉంటూ వస్తున్నారు. తమ స్నేహం పార్టీలకతీతమని చెబుతున్నారు.

కాగా వంగవీటి రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. ఇక కొడాలి నాని వైసీపీ గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాధా, కొడాలి నాని గుడివాడలో కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గుడివాడలో జరిగిన ఓ వైసీపీ నేత కుమార్తె పెళ్లికి రాధా విజయవాడ నుంచి గుడివాడ వచ్చారు.

ఇదే కార్యక్రమంలో ఉన్న కొడాలి నాని.. రాధాను ఆయన కారు దగ్గరకు వెళ్లి రిసీవ్‌ చేసుకోవడం హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి నానిపైన వంగవీటి రాధాను టీడీపీ నుంచి బరిలో దించాలని చంద్రబాబు భావించినట్టు గతంలో వార్తలొచ్చాయి.

మరి వంగవీటి రాధా.. చంద్రబాబు ప్రతిపాదనకు అంగీకరిస్తారో, లేదో తెలియదు కానీ కొడాలి నానితో మాత్రం తన స్నేహ సంబంధాలను గట్టిగానే కొనసాగిస్తున్నారు.

కాగా గతంలో పెడనలో ఒక కార్యక్రమంలో కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్, పాల్గొన్న కార్యక్రమంలో రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్ర జరుగుతుందని, తన ఇంటి పరిసరాల్లో కొంతమంది రెక్కీ నిర్వహిస్తున్నారని హాట్‌ కామెంట్స్‌ చేశారు. దీన్ని వెంటనే కొడాలి నాని ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకెళ్లడం.. రాధా వివరాలు ఇస్తే వెంటనే పోలీసులతో విచారణ చేయిద్దామని జగన్‌ చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

అంతేకాకుండా వంగవీటి రాధాను తిరిగి వైసీపీలో చేర్చే బాధ్యతను కొడాలి నాని, వల్లభనేని వంశీలకు జగన్‌ అప్పగించినట్టు వార్తలు వచ్చాయి. అప్పట్లో వల్లభనేని వంశీ, కొడాలి నాని.. వంగవీటి రాధాతో మంతనాలు సైతం చేశారు. వైసీపీలోకి వస్తే ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవిని సైతం ఇస్తారని రాధాకు చెప్పగా ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు ప్రచారం జరిగింది.

మరోవైపు రాధా తనను చంపడానికి కుట్ర జరిగిందని చెప్పినప్పుడు తాడేపల్లి కరకట్టలో ఉంటున్న రాధా వద్దకు టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా వెళ్లి పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఓవైపు కొడాలి నాని.. చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ లపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిని ఓడించాలని టీడీపీ గట్టి కంకణమే కట్టుకుంది.

ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నేత వంగవీటి రాధా.. కొడాలి నానితో భేటీ కావడం, చిరునవ్వులు చిందించడం పట్ల ఆ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. గతంలోనూ ఇలాంటి విమర్శలే రాగా వల్లభనేని వంశీ, కొడాలి నాని, రాధా ముగ్గురూ ఖండించారు. తమ స్నేహం పార్టీలకు, కులాలకు అతీతమైందని స్పష్టం చేయడం గమనార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News