విమర్శిస్తే కుక్కలు.. నక్కలైపోతారా? మరి మనమాటేంటి?

Update: 2021-10-18 05:49 GMT
రాజకీయాలు అన్నాక విమర్శలు.. ప్రతి విమర్శలు.. ఆరోపణలు.. సవాళ్లు.. శపధాలు.. లాంటివి చాలానే ఉంటాయి. ఈ విషయం రాజకీయ అధినేతలకు.. నాయకులకు తెలియంది కాదు. కానీ.. అధికారం చేతిలో ఉన్నప్పుడు తమను ఎవరూ విమర్శించకూడదని.. అంతా పాజిటివ్ గా ఉండాలన్న తీరు ఈ మధ్యన అధినేతల్లో ఎక్కువ అవుతోంది. ఎవరూ విమర్శించకుండా.. వేలెత్తి చూపించకుండానే పాలన సాగించాలన్నట్లుగా అధినాయకుల ఆలోచనలు కొత్త తరహా వ్యాఖ్యలకు తెర తీస్తున్నాయి.

కారణం ఏమైనా కానీ ఇటీవల కాలంలో ఘాటు విమర్శల్ని ఎదుర్కొనేందుకు ఏ మాత్రం ఇష్టపడని తత్త్వం ఎక్కువ అవుతోంది. తమను విమర్శించే వారి విషయాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారన్నది తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ నోటి మాటల్ని చూస్తే.. అర్థమవుతుంది. తాజాగా నిర్వహించిన పార్టీ ఎల్పీలో మాట్లాడిన ఆయన.. తనను విమర్శించే వారిని కుక్కుల.. నక్కలతో పోల్చారు. తనపై కుక్కలు.. నక్కలు చాలానే
మొరుగుతున్నాయని.. ఇప్పటిదాకా చాలా సంయమనంతో వ్యవహరించామని.. వారి మాటలకు పెద్దగా స్పందించటం లేదన్న ఆయన.. ఇకపై అలాంటి వాటిని గట్టిగా తిప్పి కొట్టాలన్న పిలుపును ఇచ్చారు.

‘‘మన సైన్యం చాలా పెద్దది. ఇక నుంచి మన మీద మొరుగుతున్న కుక్కలు.. నక్కలకు గట్టిగా బుద్ధి చెప్పాలి. మన సైన్యం తిరగబడితే ఆ కుక్కలు పరారవుతాయి. ఒక్క హైదరాబాద్ లోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నేతలు స్పందించాలి. అన్ని వేదికల మీదా ప్రతిపక్షాల వాదనల్ని తిప్పి కొట్టాలి. ప్రతిపక్షాలు పూర్తిగా అవాస్తవాల్నిప్రచారం చేస్తున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు ఖండించాలి. లేదంటే వారు చెప్పే అవాస్తవాల్నే ప్రజలు నిజం అని నమ్మే ప్రమాదం ఉంది’’ అని చెప్పారు.

దేశంలో ఇప్పటికే ఎన్నో పార్టీలు వచ్చాయి.. పోయాయని.. కానీ టీఆర్ఎస్ పటిష్టంగా ఉందన్నారు. అయినప్పటికీ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. పునాదుల్ని బలంగా వేసుకోవాలని.. పార్టీ కోసం జాగ్రత్తగా పని చేయాలని కోరారు. అంతా బాగానే ఉంది కానీ.. తమను విమర్శించే విపక్షాల్ని కుక్కులు.. నక్కలతో పోల్చే ముఖ్యమంత్రి.. తాను.. తన కుమారుడు.. మేనల్లుడు.. ఇలా పార్టీకి చెందిన కీలకమైన నేతలంతా కూడా విమర్శలు చేస్తారన్న సోయి ఎందుకు లేనట్లు? ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నట్లు?




Tags:    

Similar News