మోదీతో స్నేహంలో అమెరికా ‘మత’లబులు

Update: 2016-05-03 07:03 GMT
ప్రస్తుతం ఇండియా - అమెరికాల మధ్య సంబంధాల గురించి చెప్పమంటే  ఎవరైనా చెప్పేదొకటే.. రెండూ మిత్రదేశాలని అంటారు. మోడీ - ఒబామాలు దోస్తులని చెబుతారు. అయితే.... పైకి స్నేహం ప్రదర్శిస్తున్నప్పటికీ ఇండియాను - మోదీని బద్నాం చేయడానికి అమెరికా తెర వెనుక ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. గతంలో మోడీకి వీసా ఇవ్వకుండా తిరస్కరించిన అమెరికా ఆయన ప్రధాని అయిన తరువాత రాసుకుని పూసుకుని తిరుగుతున్నప్పటికీ ఆయన పట్ల ఉన్న వ్యతిరేకతను మాత్రం వీడనట్లుగా ఉంది. తాజాగా వెల్లడైన  యూఎస్ ఫెడరల్ ప్రభుత్వం నేతృత్వంలోని స్వతంత్ర సంస్థ యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్(యూఎస్ సీఐఆర్ ఎఫ్) వార్షిక నివేదిక ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

ఆ నివేదికలో మోడీ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశారు. మతోన్మాద ముద్ర వేశారు.  మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ లో అసహనం పెరిగిపోయిందని, మైనారిటీ వర్గాలు భయాందోళనలకు గురవుతున్నాయని యూఎస్ సీఐఆర్ ఎఫ్ ఆరోపించింది. 2015 నుంచి ఇండియాలో పరమతసహనం క్షీణిస్తున్నదని, మతస్వేచ్ఛపై నిర్భ్యంతరంగా దాడులు జరుగుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు.  బీజేపీ ముఖ్యనేతల అండతో కొందరు బాహాటంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని, తద్వారా ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా మైనారిటీలపై దాడులను ప్రోత్సహిస్తున్నట్లు అర్థం చేసుకోవాలని పేర్కొంది.

కాగా ఐక్యరాజ్య సమితి వార్షిక సమావేశంలో ప్రసంగించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ జూన్ లో వాషింగ్టన్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో యూఎస్ సీఐఆర్ ఎఫ్ నివేదిక ఈ రకమైన అంశాలు వెల్లడించడం చర్చనీయాంశంగా మారాయి. అక్కడ మోడీ పట్ల వ్యతిరేకత వచ్చేలా చేయాలన్నదే అమెరికా లక్షంగా కనిపిస్తోంది. భద్రతామండలిలో చోటు విషయంలో భారత్ కు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా తెరవెనుక కుట్ర చేస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు యూఎస్ సీఐఆర్ ఎప్ భారత అంతర్గత వ్యవస్థలపైనా తీవ్ర నిందారోపణలు చేసింది.

మైనారిటీలపై దాడులకు పాల్పడేవారిని నిరోధించడంలో పోలీసులు పక్షపాత వైఖరి చూపిస్తున్నారని అరోపించింది.  యూనైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం(యూఎస్ సీఐఆర్ ఎఫ్) దేశదేశాల్లో మతసహన పరిస్థితులపై అధ్యయనం చేసి, నివేదికలు - సలహాలు ఇస్తుంది. యూఎస్ సీఐఆర్ ఎఫ్ అధ్యక్షుడు - సభ్యులను అమెరికా అధ్యక్షుడు - సెనెట్ సభ్యులు ఎంపిక చేస్తారు. పేరుకు స్వతంత్ర సంస్థే అయినప్పటికీ ఇందులో ప్రభుత్వ ఉద్యోగులే పనిచేస్తూఉంటారు.  అమెరికా ప్రభుత్వమే దీనికి నిధులిస్తుంది.  మొత్తానికి అమెరికా సంస్థ నివేదిక చూస్తుంటే విపక్ష కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్లన్నీ ఫాలో అయి వాటి ఆధారంగా నివేదిక తయారుచేసినట్లుగా ఉంది.
Tags:    

Similar News