కేటీఆర్ ఫాం హౌజ్ పై డ్రోన్...రేవంత్ రెడ్డి అరెస్ట్

Update: 2020-03-05 17:30 GMT
తెలంగాణలో మరో సంచలన ఘటన నమోదైంది. టీ కాంగ్రెస్ నేత - మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. గతంలో ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయి నెల రోజుల పాటు జైల్లోనే ఉన్న రేవంత్ రెడ్డి మరోమారు అరెస్ట్ కావడం నిజంగానే సంచలనం రేకెత్తిస్తోంది. టీఆర్ ఎస్ సర్కారుపై తనదైన శైలిలో పోరు సాగిస్తున్న రేవంత్ ఎప్పటికప్పుడు కొత్త అంశాలను లేవనెత్తుతూ కేసీఆర్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ ఎస్ సర్కారు కూడా రేవంత్ ఎక్కడ దొరుకుతారా? ఎప్పుడు అరెస్ట్ చేద్దామా? అన్న దిశగా సాగుతోంది.

ఈ క్రమంలో మొన్న మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫాం హౌజ్ వద్దకు వెళ్లిన రేవంత్ పెను కలకలమే రేపారు. ఈ సందర్భంగా తనను అడ్డుకున్న పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. అయితే అప్పుడు ఎలాగోలా రేవంత్ ను కంట్రోల్ చేసిన పోలీసులు... ఫాం హౌజ్ నుంచి రేవంత్ ను తరలించేసి అక్కడితో సరిపెట్టుకున్నారు. అయితే ఆ తర్వాత కేటీఆర్ ఫాం హౌజ్ పై డ్రోన్ చక్కర్లు కొట్టినట్టు... దానిని రేవంత్ రెడ్డే ప్రయోగించినట్లుగా తేలడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాను ప్రయోగించారన్న అభియోగంపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు.

ఈ క్రమంలో రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో ఉన్నారన్న సమచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయనను  అదుపులోకి తీసుకుని నార్సింగ్ పోలీస్ స్టేషన్‌ కు తరలించారు. ఈ కేసులో రేవంత్ రెడ్డితో సహా ఎనిమిది మందిపై కేసులు నార్సింగి పోలీసులు నమోదు చేశారు. ఎంపీ రేవంత్ రెడ్డితో పాటుగా.. కృష్ణారెడ్డి - విజయసింహారెడ్డి - ప్రవీణ్‌ పాల్‌ రెడ్డి - జైపాల్‌ రెడ్డి - ఓంప్రకాష్‌ రెడ్డి - రాజేష్‌ - శివలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 184 - 187 - 11ఏ - రెడ్‌ విత్‌ 5ఏతో పాటుగా.. ఎయిర్‌ క్రాఫ్ట్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. వీరిలో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ కూడా చేశారు.  తాజాగా రేవంత్ ను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరినీ అరెస్ట్ చేసినట్టైంది. మరి ఈ కేసులో రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు జైల్లో ఉండాల్సి వస్తుందో చూడాలి.


Tags:    

Similar News