న‌ల్గొండ బ‌రిలో టీడీపీ ఫైర్ బ్రాండ్‌

Update: 2017-09-15 04:54 GMT
ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాలు తీసుకోవ‌టం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు కొత్తేం కాదు. ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ఎదిరించేంత ప‌రిస్థితి తెలంగాణ‌లోని ఏ రాజ‌కీయ పార్టీకి లేద‌న్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం లేకుండా బండి లాగించేస్తున్న కేసీఆర్‌కు.. ఉన్న‌ట్లుండి త‌న బ‌ల‌మెంత‌న్న విష‌యాన్ని తెలుసుకోవాల‌న్న కుతూహ‌లం క‌లిగింది. అంత‌ర్గ‌తంగా చేస్తున్న స‌ర్వేల‌న్నీ కేసీఆర్‌ కు తిరుగులేద‌ని.. టీఆర్ ఎస్‌ కు ఢోకా లేద‌ని చెబుతున్నా తెలీని అసంతృప్తి కేసీఆర్‌ ను వెంటాడుతుంద‌న్న మాట వినిపిస్తోంది.

త‌న‌కున్న బ‌లాన్ని స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నా.. ఆ విష‌యాన్ని అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చేసి.. విప‌క్షాల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయాల‌న్న త‌లంపుతో ఉన్నారు. తాను తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. చేప‌డుతున్న ప్రాజెక్టుల‌కు అడ్డుప‌డుతూ.. కోర్టు చికాకులు తెచ్చి పెడుతున్న ప్ర‌తిప‌క్షాల‌కు గ‌ట్టి స‌మాధానం చెప్ప‌టంతో పాటు.. ప్ర‌జాతీర్పు త‌మ‌కు ఎంత అనుకూలంగా ఉంద‌న్న విష‌యాన్ని అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చెప్పాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఇందులో భాగంగానే న‌ల్గొండ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి చేత రాజీనామా చేయించాల‌ని భావిస్తున్నారు.ఆ మ‌ధ్య‌న జంపింగ్స్ ఎపిసోడ్ లో గులాబీ కారెక్కిన గుత్తా.. నేటికీ గులాబీ కండువాను బ‌హిరంగంగా క‌ప్పుకున్న‌ది లేదు. కాకుంటే.. త్వ‌ర‌లో కీల‌క ప‌ద‌విని చేప‌ట్ట‌నున్న నేప‌థ్యంలో త‌న మీద ఉన్న జంపింగ్ మ‌ర‌క‌ను తుడిచేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు చెబుతారు. దీనికి కేసీఆర్ తాజా వ్యూహం జ‌త క‌ల‌వ‌టంతో ఇప్పుడు ఆయ‌న రాజీనామా ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

న‌ల్గొండ ఎంపీ స్థానానికి కాస్త అటూఇటూగా ఉప ఎన్నిక జ‌ర‌గ‌టం ఖాయ‌మైన నేప‌థ్యంలో.. బ‌రిలో దిగే వారు ఎవ‌ర‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. న‌ల్గొండ ఉప ఎన్నిక విష‌యంలో మిగిలిన పార్టీల కంటే ముందుగా టీటీడీపీనే రియాక్ట్ అయ్యింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే.. త‌మ పార్టీ త‌ర‌ఫున న‌ల్గొండ ఉప ఎన్నిక‌కు ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి బ‌రిలోకి దిగితే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. రేవంత్ లాంటి నేత బ‌రిలోకి దిగితే ఉప ఎన్నిక ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. తుది ఫ‌లితం పైనా ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. అయితే.. రేవంత్ మీద పార్టీ అధినాయ‌క‌త్వం ఏం డిసైడ్ చేస్తుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ఉప ఎన్నిక‌ల్లో తాము బ‌రిలోకి దిగాలా? వ‌ద్దా? అన్న విష‌యాన్ని టీ బీజేపీ నేత‌లు తేల్చుకోలేక‌పోతున్నారు. న‌ల్గొండ ఉప ఎన్నిక‌ల్లో రేవంత్ కానీ బ‌రిలోకి దిగితే బీజేపీ ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిస్తే ఈ పోరు మ‌రింత తీవ్రంగా ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి.. తుది నిర్ణ‌యం ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News