కేసీఆర్‌ను ప‌క్క‌న పెడ‌దాం... టార్గెట్ మార్చుకున్న రేవంత్ రెడ్డి?

Update: 2022-05-30 04:30 GMT
రాబోయే ఎన్నిక‌లే ల‌క్ష్యంగా తెలంగాణ‌లో పార్టీని బ‌లోపేతం చేయ‌డంపై కాంగ్రెస్ ఢిల్లీ పెద్ద‌లు ప్ర‌త్యేకంగా దృష్టి సారించిన సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం వరంగల్‌లో నిర్వ‌హించిన‌ రైతు సంఘర్షణ సభ ద్వారా కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ ఈ మేర‌కు క్లారిటీగా త‌మ వైఖ‌రి వెల్ల‌డించారు.

ఆయ‌న సూచ‌న‌ల ప్ర‌కారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార పార్టీగా కాంగ్రెస్‌ ఉండాలనే కృత నిశ్చయంతో పనిచేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెంచేందుకు ఇన్నాళ్లు టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకున్న రేవంత్ ఇప్పుడు త‌న ఫోక‌స్ మార్చిన‌ట్లు చెప్తున్నారు. ముందు బీజేపీని బ‌ల‌హీన‌ప‌ర్చిన త‌ర్వాత‌... టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టాల‌ని భావిస్తున్న‌ట్లు చెప్తున్నారు.

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్  ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఒదేలు ఇటీవ‌లే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ లో చేరిన సంగ‌తి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబానికి న‌మ్మిన‌బంటుగా ఉన్న ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ తీరును విబేధిస్తూ ఓదెలు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీలోని మ‌రికొంద‌రిని రేవంత్ టార్గెట్ చేయ‌వ‌చ్చ‌న్న టాక్ వినిపించింది.

అయితే, రేవంత్ ఫోక‌స్ మార్చిన‌ట్లు చెప్తున్నారు. తాజాగా ఆయ‌న బీజేపీపై ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి ఇవాళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ గూటికి చేరారు. శోభారాణి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఆ పార్టీకి మరికొంత బలం చేకూరుతుందని రాజకీయ పండితులు భావిస్తున్నారు.

బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వ‌చ్చే నేత‌ల‌కు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ హామీ ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. త‌ద్వారా బీజేపీ కంటే వేగంగా బ‌ల‌ప‌డే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందుకు బండ్రు శోభారాణి చేరిక ఉదాహ‌ర‌ణ అని అంటున్నారు.  ప్రస్తుతం ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుండి సునీతా మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె వరుసగా రెండు సార్లు విజయం సాధించి నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు.

ఇక కాంగ్రెస్ తరపున బీర్ల ఐలయ్య పార్టీ ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. అయితే, ప్రస్తుతం ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి మహిళా కావడంతో కాంగ్రెస్ తరఫున కూడా ఓ మహిళ అభ్యర్థినే నిలబెడితే కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయ‌నే దిశ‌గా రేవంత్ రెడ్డి ఆలోచ‌న చేసి బండ్రు శోభారాణికి ఎమ్మెల్యే టికెట్ హామీ ఇచ్చార‌ని అంటున్నారు. మొత్తంగా కొద్దిరోజుల పాటు టీఆర్ఎస్ కంటే బీజేపీ టార్గెట్ గానే రేవంత్ ముందుకు సాగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా.
Tags:    

Similar News